కురవి, వెలుగు: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జరిగే కందికొండ జాతరకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి కందికొండకు చేరుకొని వేంకటేశ్వర స్వామి, నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. కిసాన్ పరివార్ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు వాటర్ బాటిల్, పులిహోర ప్యాకెట్లను అందించారు. కందికొండ గుట్ట వద్ద ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ కుటుంబ సభ్యులతో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే తో పాటు కిసాన్ పరివార్ సంస్థ సీఈవో వివేక్ పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండలాధ్యక్షుడు అంబటి వీరభద్ర గౌడ్, కురవి వీరభద్ర స్వామి ఆలయ చైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్, మరిపెడ సీఐ రాజ్ కుమార్ గౌడ్, సిరోల్ ఎస్సై నగేశ్ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుట్టవద్ద తహసీల్దార్ సునీల్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో వీరబాబు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా, కార్తీక పౌర్ణమి శుక్రవారం సందర్భంగా కురవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.