చివరి కార్తీక సోమవారం.. భద్రాచలంలోకిక్కిరిసిన ఆలయాలు

భద్రాచలం, వెలుగు :  కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. నదీమాతల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలు, వస్త్రాలు సమర్పించుకుని మహిళాలు వాయినాలు ఇచ్చుకున్నారు. శివాలయాల్లో ముందుగా శివపార్వతులకు పంచామృతాలతో అభిషేకం, లక్ష బిళ్వార్చన పూజలు చేశారు. శివయ్యకు మహారుద్రాభిషేకం వైభవంగా భక్తిప్రవత్తులతో నిర్వహించారు. సీతారామచంద్రస్వామికి ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరించి ముత్తంగి సేవను చేశారు.

లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామికి కూడా ఈ సేవలు వేదోక్తంగా జరిపారు. బేడా మండపంలో సీతారాములకు నిత్య కల్యాణం జరిగింది. సాయంత్రం రామాలయం అనుబంధ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వస్వామి ఆలయంలో మహిళలు ఆకాశదీపం తిలకించి, ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అర్చకులు గోదావరికి కార్తీక నదీ హారతులను వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల జయజయధ్వానాలు మధ్య అందజేశారు. 

కారేపల్లి/జలూరుపాడు/పాల్వంచ : కారేపల్లిలోని శ్రీ విఘ్నేశ్వర విశ్వేశ్వర సీతారామాంజనేయ శివాలయంలో ఆలయ భక్తమండలి ఆధ్వర్యంలో అర్చకులు నాగసాయి శర్మ, వెంకటేశ్వరరావు శర్మ స్వామివారికి 30 కేజీల బియ్యంతో అన్నాభిషేకం నిర్వహించారు.

జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో పాలగుట్టపై కొలువై ఉన్న రుక్మిణి సమేత శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయం, మండల కేంద్రంలో శ్రీ సాయి బాబా ఆలయం,  పాల్వంచలోని నవభారత్ స్పాంజ్ ఐరన్ కాలనీ లోని పార్వతీ సమేత రామ లింగేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.