కొమురవెల్లిలో భక్తుల సందడి

కొమురవెల్లిలో భక్తుల సందడి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయమే భక్తులు కోనేరులో స్నానం చేసి స్వామివారికి తలనీలాలు సమర్పించారు. మల్లన్న స్వామిని దర్శించుకుని బోనం సమర్పించి, ఒడిబియ్యం పోశారు. గంగరేగు చెట్టు దగ్గర పట్నాలు వేసి, తమ కోరికలు నెరవేరాలని ముడుపు లు కట్టారు. 

రద్దీ కారణంగా పట్నాలు, బోనాల టికెట్లు,  ప్రసాదాల దగ్గర భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఈవో రామాంజనేయులు ఆధ్వర్యంలో ఏఈవో శ్రీనివాస్, సూపరింటెండెంట్ సురేందర్ రెడ్డి, శ్రీరాములు ఏర్పాట్లు పర్యవేక్షించారు. హైదరాబాద్​కు చెందిన భక్తురాలు గంగరేగు చెట్టు ప్రాంగణంలో పర్సును పోగొట్టుకుంది. మల్లన్న స్వాములు అత్తిని శ్రీకాంత్, తుపాకుల సాయిలుకు ఆ పర్సు దొరకగా  ఆమెకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు.