
జీవితంలో ప్రతి సందర్భాన్ని మనిషి తన తెలివితేటలతో రకరకాలుగా బేరీజు వేసి సుఖం, దుఃఖం అంటూ రెండుగా విభజించటం కనపడుతుంది. అదే వాస్తవమని నమ్ముతాం కూడా. 'సుఖం' అంటే చక్కగా ఉండటం. 'దుఃఖం అంటే చక్కగా లేకపోవటం, ఇబ్బందికరంగా ఉండటం. మామూలు మాటల్లో చెప్పాలంటే బాగుండటం, బాగుండకపోవటం: హాయిగా ఉండటం, లేకపోవటం.
ఈ సుఖం, దుఃఖం అనేవి శాశ్వతమైనవా? ఒకదానికొకటి ప్రతికూలమైనవా? జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ఎవరూ చెప్పనక్కర లేకుండానే. ఈ సుఖ దుఃఖాలు బాహ్యస్పర్శల వల్ల మాత్రమే కలుగుతూ ఉంటాయి. మాత్రాస్పర్శ లేకపోతే అవి బాధించవు. మాత్రాస్పర్శ అంటే పంచతన్మాతలకు స్పందిస్తూ ఉండటం. ఈ స్థితి సాధ్యమా అని సందేహం కలగటం సహజం.
అసలు సుఖం అంటే ఏమిటి? భౌతికమైన అంశాల మీద ఆధారపడిన తాత్కాలికంగా కలిగే హాయి. ఉదాహరణకి శీతకాలం చల్లదనం దుఃఖాన్ని కలిగిస్తుంది. వేసవికాలం ఎండ బాధిస్తుంది కనుక అది దుఃఖం అనిపిస్తుంది. కాని, ఈ చల్లదనం, వేడిమి రుతువులు మారితే సుఖాన్ని కలిగిస్తున్నాయి. వేసవిలో చల్లదనం, శీతాకాలంలో వెచ్చదనం సుఖహేతువులవుతున్నాయి. అంటే సుఖము, దుఃఖము అన్నవి చల్లదనంలోను, వెచ్చదనంలోనూ లేవు. వాటి స్పర్శ కలిగిన కాలం మీద ఆధారపడి ఉన్నాయి. వాటికి లోబడక తట్టుకునే తెలివి ఉన్న వారిని అవి బాధించవు. వాటిని గెలవాలని ప్రయత్నం చేస్తే మాత్రం సాధ్యం కాదు.
వేసవిలో చల్లని పదార్థాలతోనూ, వాతావరణాన్ని చల్లబరచే ప్రయత్నాలతోనూ ఎండ బాధ తనని తాకకుండా అధిగమించవచ్చు. అదేవిధంగా చలికాలంలో చలిమంటలతోనో, వెచ్చని దుస్తులు ధరించటంతోనో సుఖంగా ఉండవచ్చు. వీటి కోసం అంతగా బాధపడవలసినది ఏముంది? మాత్రాస్పర్శలని పట్టించుకోకుండా ఉంటే చాలు కదా.
సుఖదుఃఖాలన్నవి బాహ్యమైన అంశాలమీద ఆధారపడవు మానసిక స్థితి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి ఒక పదార్థం అంటే చాలా ఇష్టం అనుకుందాం. అది తింటూ ఉంటే సుఖంగా ఆనిపిస్తుంది. ఇష్టమైన పదార్థమే కాని ఒక పరిమితి దాటిన తరువాత సుఖమనిపించదు. ఐస్క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఒకటి, రెండు, మూడు తింటుంటే ఎంతో బాగుంటుంది. మరొక్కటి అని బలవంతం చేస్తే మొహమాటపడవచ్చు. ఆ తరువాత దానిని తినటం సుఖం అనిపించదు. పోనుపోను బాధాకరంగా మారుతుంది. సుఖం అనిపించిన దాని పరిణామం సుఖంగానే ఉండనక్కర లేదు. దుఃఖంగా కూడా ఉండవచ్చు. రెండింటిని పట్టించుకోని స్థితి వచ్చినప్పుడు సుఖము.... దుఃఖము అనేవి పట్టవు. దీనికి మంచి ఉదాహరణ చెపుతారు పెద్దలు.
చలనచిత్రం లేదా ప్రస్తుత కాలంలో అందరి నట్టింట్లోను పెత్తనం చేస్తున్న టీవీ తెర మీద కనపడే దృశ్యాలు సంతోషాన్ని కలిగించేవి అయినా... బాధని కలిగించేవి. అయినా చూసే వారికి సుఖము కలగదు. ...దుఃఖము కలగదు. ఆనందం మాత్రమే అనుభవిస్తారు. బాధాకరమైన సంగతి కూడా సంతోషాన్నే కలిగిస్తుంది. ఆ పాత్రలు మాత్రం వాటిని అనుభవిస్తూ ఉంటాయి. మనిషి తన జీవితంలోని సంఘటనలని కూడా విధంగా చూడటం అలవాటు చేసుకుంటే సంతోషం ఆనందం ఉంటాయి. బాధ, దుఃఖం ఉండవు.
సుఖం... దుఃఖం అన్నవి మనసు పట్టించుకున్నంత వరకే అనుభవంలో ఉంటాయి. లేకపోతే ఉండవు... చాలా ఇష్టమైన సంగీతం దానిలో లీనమై వింటున్నప్పుడు దుర్వాసన వస్తున్నా అది మనసుకెక్కి బాధ కలిగించదు. మనకి ఇష్టమైన వారి సాంగత్యంలో ఉన్నప్పుడు బాహ్యమైన పరిస్థితులు ఉక్కపోసినా, చలేసినా, కూర్చోటానికి తగిన ఆసనాలు లేకపోయినా సుఖం లేదు అనిపించదు. శరీరం బాగా అలసిపోయి నిద్ర ముంచుకు వస్తున్నప్పుడు పక్క ఎట్లా ఉన్నా నిద్ర సుఖంగానే పడుతుంది. మనసులో బాధ ఉన్నప్పుడు నిద్ర పట్టదు. పట్టుపరుపులు సుఖాన్ని కలిగించవు. అంటే సుఖానుభూతి, దుఃఖానుభూతి అన్నవి మనసుకి సంబంధించినవి మాత్రమే అని అర్థం అవుతోంది కదా..
పైగా సుఖ దుఃఖాలన్నవి పరస్పర పరిపూరకాలు. ఒకటి ఉన్నప్పుడు రెండోది ఉండదు. అందుకే సుఖ దుఃఖాలని పగలు రాత్రులతోను, వెలుగు చీకటులు మొదలైన ద్వంద్వాలతో పోల్చుతారు. వీటిలో ఒకదాని వైభవం తెలియటానికి మరొక దానిని అనుభవించాలి. చీకటి తరువాతనే వెలుగు గొప్పతనం తెలుస్తుంది. అలిసిన వారికే విశ్రాంతి సుఖాన్నిస్తుంది. అదేవిధంగా దుఃఖం అనుభవించిన తరువాతనే సుఖం విలువ తెలుస్తుంది. ద్వంద్వాలైన సుఖ దుఃఖాలు మాత్రాస్పర్శ కారణంగానే కలుగుతాయి కనుక పంచతన్మాతలని అదుపులో పెట్టుకుంటే, అంటే వాటిని తన చెప్పు చేతల్లో పెట్టుకున్న మనసు వాటిని పట్టించుకోకుండా ఉంటే, సుఖానికి దుఃఖానికి అతీతమైన స్థితి ఉంటుంది.
దుఃఖ స్పర్శతో జీవుడు తానే దుఃఖంగా మారిపోతాడు. ఈ రకమైన మార్పులనే మృత్యువు అంటారు. ఈ మార్పులకి లోనుకాకుండా ఉండే ధీరుడే అమృతత్వాన్ని పొందగలడు. అప్పుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించటం జరుగుతుంది.. ఈ విషయాలని యుద్ధభూమిలోకి వచ్చాక యుద్ధం చేయటానికి భయపడి దుఃఖిస్తున్న అర్జునుడికి శ్రీకృష్ణపరమాత్మ బోధించి, కర్తవ్యోన్ముఖుడిని చేశాడు.
"మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దు:ఖదాః-
ఆగమాపాయినో నిత్యా స్తాం స్తితిక్షస్వ భారత".
ఇది అందరికీ, అన్ని సందర్భాలలోనూ పనికి వచ్చేదే కదా.
-వెలుగు,లైఫ్–