శాంతి భద్రతలు కాపాడటమే మా లక్ష్యం: గ్రూప్ -1 ఆందోళనలపై స్పందించిన డీజీపీ

శాంతి భద్రతలు కాపాడటమే మా లక్ష్యం: గ్రూప్ -1 ఆందోళనలపై స్పందించిన డీజీపీ

హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలంటూ గత నాలుగు రోజులుగా అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. పరీక్ష  వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు వేల సంఖ్యలో రోడ్డెక్కడంతో హైదరాబాద్‎లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలపై తెలంగాణ డీజేపీ జితేందర్ స్పందించారు. ఇవాళ (అక్టోబర్ 19) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తామని..  గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలుంటే అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని.. అంతేకానీ నిరసనల పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలను కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కాగా, గ్రూప్ 1 అభ్యర్థులకు ఆందోళనలకు బీఆర్ఎస్, బీజేపీ మద్దతు ప్రకటించాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ అశోక్ నగర్ వెళ్లి గ్రూప్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. 

ALSO READ : GO 29, GO 55 మధ్య తేడా ఏంటి : గ్రూప్ 1 అభ్యర్థులు ఎందుకు రోడ్లెక్కుతున్నారు..?

ఈ క్రమంలోనే చలో సచివాలయానికి పిలుపునివ్వగా.. అశోక్ నగర్, లోయర్ ట్యాంక్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. దీంతో బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి తరలించారు. మరోవైపు గ్రూప్ 1 అభ్యర్థులకు ఆందోళనకు సపోర్ట్ గా బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రోడ్డెక్కారు. బీఆర్కే భవన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్‎ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‎కు తరలించారు. మరోవైపు సచివాలయం ముందు గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు.