ధనుర్మాసం : తిరుప్పావై 14వ రోజు పాశురం.. లేండి అమ్మల్లారా.. ఇక నిద్ర వీడండి.. గోపికలతో ఆండాళ్లు అమ్మవారు..!

ధనుర్మాసం : తిరుప్పావై 14వ రోజు పాశురం.. లేండి అమ్మల్లారా.. ఇక నిద్ర వీడండి.. గోపికలతో ఆండాళ్లు అమ్మవారు..!

ఊరినంతటిని ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్ధత కలిగిన నాయకురాలైన ఒక గోపాంగనను ఆండాల్ తల్లి (యీ పాశురంలో) లేపుతున్నది. స్నానము చేయుటకు గోపికల నందరును లేపుదునని చెప్పి నిద్రించుచున్న ఒక ఆమెను ఈ పాశురములో మేల్కొల్పుచున్నారు.తానే వచ్చి అందరను మేల్కొల్పుతానని బీరాలు పల్కి, ఇంకను నిద్రబోవుచున్నదీ గోపిక. తన పెరట్లోని దిగుడుబావిలోని కలువలూ, తామరలనూ చూచుకొని మురిసిపోతున్నదీమె. ఈ మధురానందంలో మునిగి తాను చేసిన బాసలను మరిచిపోయినది.ఈమె భగవదనుగ్రహంతో భవానంద సాగరంలో మునిగి ఇతర విషయాలను మరిచి..  ఆ ఆనందాను భూతిలోనే నిమగ్నయైనత్తిట్టి యిట్టి గోపికను (యీ పాశురంలో) మన ఆండాళమ్మ మేల్కొలుపుతున్నది.

     ఉజ్గళ్ పుళైక్కడై త్తోట్టత్తు వావియుళ్
    శెజ్గళు నీర్ వాయ్ నెగిళ్ న్దు అమ్బల్ వాయ్ కూమ్బినకాణ్
    శెజ్గల్ పొడిక్కూఱై వెణ్బల్ తవత్తవర్
    తజ్గళ్ తిరుక్కోయిల్ శజ్గిడువాన్ పోగిన్ఱార్
    ఎజ్గళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశుమ్
    నజ్గాయ్! ఎళున్దిరాయ్ నాణాదాయ్ నావుడైయాయ్!
    శజ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
    పజ్గయక్కణ్తానై ప్పాడేలో రెమ్బావాయ్!!


భావం:  ఓ పరిపూర్ణురాలా ....  నీ పెరటి తోటలో దిగుడుబావిలో ఎర్ర తామరలు వికసించినవి. నల్లకలువలు ముడుచుకొనిపోవుచున్నవి. ...లెమ్ము .... ఎఱ్ఱని కాషాయములను దాల్చి తెల్లని పలువరుస కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమతమ ఆలయములలో ఆరాధనము చేయుటకై పోవుచున్నారు లెమ్ము.  ముందుగా  నీవు మేల్కొని వచ్చి, మమ్ములను లేపుదువు అని మాట ఇచ్చినావు కదా ... మరచితివా....  లెమ్ము ...ఓ మాట నేర్పుగలదానా...  శంఖమును ..చక్రమును ధరించిన వాడును..ఆజానుబాహువును అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు లేచిరమ్ము.  ఏమె సఖీ.... ఇదేమి? ముందుగ మమ్ములను లేపుదునంటివికదా...  ఇంతవరకును పండుకొనే వున్నావేమి.... లే.... లెమ్ము.... తెల్లవారిపోయినది. అటు చూడు...  మీ పెరటిలోని ఎర్రకలువలు విచ్చుకున్నవి.

 నీలోత్పలాలు ముకుళించినవి. కాషాయంబరులైన మునులు... యోగులు తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచెకోలను తాళపు చెవులను తీసికొని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతః కాలమగు సూచనలేకదా....  నీవు చేసిన వాగ్దానమును మరచితివా? నీకేమి? నీవు పూర్ణురాలవుకదా! సరే! ఇకనైన లేచిరమ్ము. వాగ్దానమును మరచావా.. లేవవమ్మా అనగా నన్నేల నిందింతురు.... నేనేమి చేయవలె... ననగా శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలవానిని, పంక జాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనుమమ్మా' అని గోదాదేవి యీ (పాశురంలో)  గోపికను లేపిచున్నది.   

ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపెదనని చెప్పిన ఒకగోపిక మేల్కొల్పబడుచున్నది. ఈమె వీరి సంఘమునకు అంతకు నాయకురాలై నడిపింపగల శక్తి గలది, తన పూర్ణానుభవముచే ఒడలు మరచి తాను చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరించి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తను ఉండిపోయెను. ఈమె ఇంటిలో ఒకపెద్ద తోట కలదు. పెరటి వైపున ఉన్న ఆ తోటలో దిగుడుబావి కలదు.  ఆ దిగుడుబావిలో తామరపూవులు, కలువపూవులు ఉన్నవి. ఆమె తన్మయతతో అనుభవించుచు ఇతరములను మరచి ఉండెను. అట్టి స్థితిలో ఉన్న గోపికను  మేలుకొలుపు చున్నారు.