
- రూ.కోట్లల్లో సొమ్ము పెండింగ్
- ధరణి పోర్టల్ రద్దవుతున్న వేళ బాధితుల్లో ఆందోళన
భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన దామోదర్ రెడ్డి బోడిపల్లిలోని 25 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం 2021 జులై 2న మధ్యాహ్నం 12.45 గంటలకు స్లాట్ బుక్ చేసుకున్నారు. ఇందుకోసం ఈయన రూ.1,54,533 స్టాంప్ డ్యూటీ చెల్లించారు. కానీ అనివార్య కారణాలతో ఒక రోజు ముందే స్లాట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ డబ్బులు తిరిగి తమకు రీఫండ్ చేయాలని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. కానీ ఇప్పటివరకు ఆ డబ్బులు జమ కాలేదు.
ఏపీకి చెందిన ఓ వ్యక్తి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం గుంటపల్లిలోని వ్యవసాయ భూమి కొనుగోలు చేసేందుకు 2023 మే19న స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, మ్యుటేషన్ చార్జీలు, హరిత నిధి కలిపి మొత్తం రూ.2,50,456 చెల్లించారు. అనుకోకుండా స్లాట్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. చెల్లించిన తమ డబ్బులు రీఫండ్ చేయాలని ఎన్ని సార్లు అడిగినా స్పందన లేదు.
కరీంనగర్, వెలుగు: ధరణి పోర్టల్ లో భూమి రిజిస్ట్రేషన్, విరాసత్, పార్టిషన్, నాలా కన్వర్షన్ కోసం బుక్ చేసుకున్న స్లాట్ ను అనుకోని పరిస్థితుల్లో క్యాన్సిల్ చేసుకుంటే, లేదా పోర్టల్ లోనే సమస్య వల్ల క్యాన్సిల్ అయితే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల కింద చెల్లించిన డబ్బులు వాపస్ రావడం లేదు. ధరణి పోర్టల్ ను ప్రారంభించినప్పటి నుంచే తలెత్తిన ఈ సమస్యను ఇప్పటివరకు పరిష్కరించకపోవడంతో బాధితులు చెల్లించిన సొమ్ము సర్కార్ ఖజానాలోనే ఉండిపోయింది.
ధరణిలో డబ్బులు పోగొట్టుకున్న రైతులు, ఇతర వ్యక్తులు స్లాట్ క్యాన్సిల్ చేసిన స్లిప్పులతో తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసులు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు వాపస్ చేయడం తమ చేతుల్లో లేదని, పైనుంచే రావాలని అధికారులు చేతులెత్తేస్తున్నారు. డబ్బులు ఎప్పుడు వస్తాయని అడిగితే ఏ ఆఫీసర్ వద్దా సరైన సమాధానం లేదు. అయితే, ధరణి పోర్టల్ స్థానంలో సోమవారం నుంచి భూభారతి పోర్టల్ తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో.. ధరణిలో డబ్బులు పొగొట్టుకున్న బాధితుల్లో ఆందోళన మొదలైంది. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.
లక్షన్నర మంది బాధితులు..
భూరికార్డుల నిర్వహణకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో కొన్ని సమస్యలకు పరిష్కారం లభించలేదు. స్లాట్ బుక్ చేసుకున్నప్పుడే రిజిస్ట్రేషన్ కు అయ్యే చార్జీలను స్వీకరించే ఈ పోర్టల్ లో ఏదైనా సమస్య వచ్చి క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం వాపస్ చేసే టెక్నాలజీ లేదు. 2020 నవంబర్ 2న ధరణి పోర్టల్ లో సర్వీసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సమస్యకు సర్కార్ పరిష్కారం చూపలేదు.
2020 నవంబర్ నుంచి 2 మార్చి 31 వరకు 14,105 స్లాట్లు క్యాన్సిల్ కాగా, 2021 ఏప్రిల్ 1 వరకు 2022 మార్చి నెలాఖరు వరకు 45,012 స్లాట్లు, 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు 35,598 స్లాట్లు వివిధ కారణాలతో క్యాన్సిల్ అయ్యాయి. గత రెండేళ్లలో మరో 60 వేల స్లాట్లు వివిధ కారణాలతో క్యాన్సిల్ అయ్యాయని అంచనా. లక్షన్నరకుపై స్లాట్లు క్యాన్సిల్ కాగా.. వీటికి సంబంధించిన కోట్లాది రూపాయలు సర్కార్ ఖజానాలోనే ఉండిపోయాయి. వీరంతా రీఫండ్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు.
టెక్నికల్ సమస్యతోనే..
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్టాంపు డ్యూటీ చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ ను రద్దు చేసుకుంటే.. జిల్లా రిజిస్ట్రార్ స్టాంపు డ్యూటీ ఫీజులో 10 శాతాన్ని సర్వీసు చార్జీల కింద కట్ చేసుకుని మిగతా డబ్బులను ఇవ్వాలనే నిబంధన ఉంది. ధరణి పోర్టల్ లోనూ ఇదే నిబంధన విధించారు. ధరణిలో స్లాట్ క్యాన్సిల్ అయితే బుక్ చేసుకున్న వ్యక్తి పేరు, తండ్రి/భర్త పేరు, జండర్, వయస్సు, వృత్తి, ఆధార్ నంబర్, పాస్ బుక్ నంబర్, జిల్లా, మండలం, ఖాతానంబర్, సర్వే నంబర్, విస్తీర్ణం, స్లాట్ బుక్ చేసుకున్న డేట్, టైం, చెల్లించిన స్టాంప్ డ్యూటీ మొత్తం, బ్యాంకు పేరు, అకౌంట్ నంబర్, సెల్ నంబర్, అడ్రస్ వివరాలు, పాస్ బుక్, పేమెంట్ డాక్యుమెంట్లతో రీఫండ్ కోసం జిల్లా కలెక్టర్ కు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. కలెక్టర్ వివరాలు వెరిఫై చేసి అప్రూవల్ చేస్తే ట్రెజరీ ద్వారా రీఫండ్ ప్రాసెస్ అవుతుంది. అప్లై చేసుకున్న 7 రోజుల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ధరణి పోర్టల్ లోని సమస్య కారణంగా ఎవరికీ ఇప్పటివరకు డబ్బులు రీఫండ్ కాలేదు.
రూ.43,758 రీఫండ్ కాలే..
మా నాన్న 2019లో చనిపోయాడు. మా రెండో అన్నయ్య వెంకటేశ్వర్ రెడ్డి కరోనాతో 2021లో మృతి చెందాడు. మా నాన్న నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో మా అన్న భాగాన్ని ఆయన కొడుకు (మైనర్) పేరుమీద చేయాలను కున్నాం. స్లాట్ బుకింగ్ టైంలో ఆ బాబు ఆధార్ నంబర్ తప్పుగా నమోదు కావడంతో దాన్ని సరి చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాం. ఎడిట్ చేయడానికి ధరణిలో ఏ ఆఫీసర్ కూ ఆప్షన్ లేదని చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో ఆ స్లాట్ క్యాన్సిల్ చేసుకుని మళ్లీ కొత్తగా స్లాట్ బుక్ చేసుకుని సక్సేషన్ చేసుకున్నాం. అయితే క్యాన్సిల్ చేసుకున్న స్లాట్ కు సంబంధించిన డబ్బులు రూ.43,758 ఇప్పటివరకు రీఫండ్ కాలేదు. - మురళీధర్ రెడ్డి, గంగన్నగూడెం, కొందుర్గు మండలం, రంగారెడ్డి జిల్లా