పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో ఫూలే విగ్రహం ఎందుకు పెట్టలే?

పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో ఫూలే విగ్రహం ఎందుకు పెట్టలే?
  • ధర్నా చౌక్​ను ఎత్తేసిన చరిత్ర 
  • బీఆర్ఎస్​ పార్టీది
  • ఇప్పుడు అదేచోట ఎమ్మెల్సీ కవిత ధర్నాకు కూర్చోవడం విడ్డూరం
  •  బీసీ సంక్షేమ సంఘం 
  • జాతీయ అధ్యక్షుడు 
  • జాజుల శ్రీనివాస్​గౌడ్ విమర్శ

బషీర్​బాగ్, వెలుగు: ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత కొత్త డ్రామాకు తెరతీశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.  పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో అసెంబ్లీలో ఫూలే విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కవితకు ఫూలే పేరు పలికే అర్హత లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏనాడూ ఫూలే విగ్రహానికి నివాళులర్పించలేదన్నారు. మంగళవారం హైదరాబాద్  బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్​చారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఫూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ గా బీసీ కుల సంఘాల కో -చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్​ను ఎన్నుకున్నారు. 

ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. ధర్నా చౌక్​ను ఎత్తేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని, ఇప్పుడు అదే ధర్నా చౌక్ లో కవిత దీక్షకు కూర్చోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్​లో బీసీ నాయకులే లేనట్టు.. కవిత బీసీ నినాదం ఎత్తుకుందని, ఆమె మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ కు జ్యోతిబాఫూలే పేరు పెట్టి, తన నిబద్ధతకు చాటుకుందన్నారు. ఈ నెల 11న ఫిలింనగర్​లో ఫూలే 198వ జయంతి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలిరావాలని పిలుపునిచ్చారు. 

సావిత్రి బాయి, ఫూలే ఏడు అడుగుల విగ్రహాలు ఏర్పాటుతోపాటు భారీగా జయంతి సభ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. త్వరలో ప్రతి జిల్లా కేంద్రంలో ఫూలే విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. చదువే ఆయుధంగా ఫూలే ముందుకు సాగారని, ఆయనకు భారతరత్న ప్రకటించాలని డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల స్థలంలో ఫూలే నాలెడ్జి సెంటర్, విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు.