ఖమ్మం జిల్లాలో సదరం కోసం తిప్పలు .. ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులు

ఖమ్మం జిల్లాలో సదరం కోసం తిప్పలు .. ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులు
  • వెయిటింగ్ వేలల్లో, స్లాట్లు పదుల్లో
  • స్లాట్ బుకింగ్​ టైమ్​లో సతాయిస్తున్న సర్వర్​ 

ఖమ్మం/ ఖమ్మం టౌన్​, వెలుగు: జిల్లాలో సదరం సర్టిఫికెట్లు తీసుకునేందుకు వికలాంగులు  ఇబ్బందులు పడుతున్నారు. సదరం క్యాంప్​ ల కోసం ఎదురుచూస్తున్న వాళ్లు వేలల్లో ఉండగా, స్లాట్లు మాత్రం పదుల సంఖ్యలో ఉంటున్నాయి. దీంతో బుకింగ్ చేసే టైంలో సర్వర్​ జామ్​ అవుతోంది. అయినా.. స్లాట్​ బుక్​ అవుద్దన్న ఆశతో వికలాంగులు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక కల్లూరు మండలంలో వంద మంది దాకా సదరం క్యాంప్​ కోసం వేచి చూస్తుండగా.. జిల్లా మొత్తం కలిపి కేవలం 160 స్లాట్లకు మాత్రమే అవకాశం ఉందంటే పరిస్థితి ఎలా ఎందో అర్థం చేసుకోవచ్చు. 

గడువుతో సమస్య

క్యాంప్​ లు ఏర్పాటుచేసినప్పుడు రెండ్రోజుల ముందు మాత్రమే స్లాట్ బుక్​ చేసుకోవడానికి వీలుంది. కొత్త సర్టిఫికెట్​ కోసం, రెన్యూవల్​ కోసం వేలల్లో వికలాంగులు మీసేవాల దగ్గర క్యూ కడుతున్నారు. ఇదే అవకాశంగా భావిస్తున్న దళారులు కొందరు డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. 

ప్రతి మంగళవారం క్యాంప్​

ఖమ్మం కలెక్టర్​ ఆదేశాలతో ఈనెల 9 నుంచి సెప్టెంబర్​ 24 వరకు ప్రతి మంగళవారం ఖమ్మం ప్రధాన ఆస్పత్రిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సదరం క్యాంప్​ నిర్వహించనున్నారు. ఆధార్​ కార్డు జిరాక్స్​, పాస్​ ఫొటోని తీసుకొని మీ సేవా కేంద్రంలో స్లాట్ బుక్​ చేసుకోవాలి. స్లాబ్​ బుకింగ్ ప్రకారం మీ సేవ రశీదుతో పాటు ఆధార్​ జిరాక్స్​, పాస్​ పోర్ట్ సైజ్​ ఫొటో, మెడికల్ రిపోర్ట్ తో క్యాంప్​ నకు అటెండ్ కావాలి. అక్కడ పరీక్షల ద్వారా డాక్టర్లు వైకల్యాన్ని నిర్థారిస్తారు. పోస్టు ద్వారా సర్టిఫికెట్ ను జారీ చేస్తారు. 

అర్హతలేకున్నా సర్టిఫికెట్​ కోసం యత్నాలు

వికలాంగులు ప్రత్యేక రాయితీలు, పథకాల ద్వారా లబ్ది పొందేందుకు సదరం సర్టిఫికెటే ఆధారం. సదరం క్యాంపుల ద్వారా అర్హులైన వారిని గుర్తించి అధికారులు సర్టిఫికెట్​ జారీ చేస్తారు. అయితే కొందరు తప్పుడు మార్గంలో మార్గంలో సదరం సర్టిఫికెట్లు పొందుతున్నారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ల కోసం, అర్హత లేకున్నా రాయితీల కోసం రూ.30 వేల నుంచి రూ.40వేలు ఖర్చు చేసి మరీ బ్రోకర్ల ద్వారా సదరం సర్టిఫికెట్లు పొందుతున్నాన్న ఆరోపనలు ఉన్నాయి.

ఎప్పుడోజరిగిన యాక్సిడెంట్ల ఎక్స్​రేలు చూపిస్తూ కొందరు , వినికిడి, చూపు, సరిగా లేదని కొందరు తప్పుడు ఆధారాలు చూపుతూ సదరం సర్టిఫికెట్లు పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే పెన్షన్​ పొందుతున్న వారిలోనూ చాలా మంది తప్పుడు సర్టిఫికెట్లు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి కూడా ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో వీరి నుంచి దరఖాస్తులు, రెన్యువల్స్​ ఉండటంతో అర్హులైన వారికి ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి స్లాట్​ బుకింగ్​ ఈజీగా అయ్యేలా చర్యలు తీసుకొని, అర్హులకే సదరం ఇవ్వాలని కోరుతున్నారు. 

స్లాట్లు బుక్​ కావట్లేదు

 స దరం క్యాంపులకు స్లాట్ బుక్​ కావడం లేదు. మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా స్లాట్ దొరక్క దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్క కల్లూరు మండలంలోనే 100 మంది వరకు సదరం క్యాంపుల గురించి ఎదురుచూస్తుంటే, జిల్లా మొత్తం కలిపి కేవలం 160 స్లాట్లు మాత్రమే కేటాయించారు. ఇలా అయితే అర్హులైన దివ్యాంగులకు కూడా అన్యాయం జరుగుతోంది.

ఊడల కృష్ణ, దివ్యాంగుల సంఘం నేత 

రెండేళ్లుగా సదరం స్లాట్ దొరకట్లేదు

నాకు 60 సంవత్సరాలు. పదేళ్ళుగా కీళ్ళ వాతంతో బాధ పడుతూ నడవలేని పరిస్థితిలో ఉన్న. గ్రామంలో కొంత మంది సలహాతో వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుందామని మండల కేంద్రంలో మీ సేవాకు గత రెండేళ్లుగా వెళ్తున్న. కానీ స్లాట్ బుకింగ్ గంటకే అయిపోతున్నాయని చెప్తున్నారు. మధ్యవర్థుల ద్వారా సర్టిఫికెట్ పొందవచ్చని, దానికోసం 30 వేలు అవుతుందన్నారు. నా దగ్గర అంత మొత్తం లేక ఇవ్వలేను అని చెప్పాను.  

రామిశెట్టి రాజారావు, యడ్ల బంజర