
- గన్ని బ్యాగులు, హమాలీల కొరత
- కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కరువు
- అకాల వర్షాలతో రైతుల ఆందోళన
మెదక్, కౌడిపల్లి, రామాయంపేట, వెలుగు: జిల్లాలో వరి కోతలు జోరందుకున్నాయి. పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. చాలాచోట్ల గన్ని బ్యాగులు రాకపోవడం, లారీలు సమకూర్చకపోవడంతో వడ్లు తూకం వేయడంలేదు. దీంతో పెద్ద మొత్తంలో ధాన్యం పేరుకుపోతుంది. రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలు పడుతుండడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో రైతులు పండించిన ధాన్యంలో 3,89,774 టన్నులు కోనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు.
పీఏసీఎస్ ఆధ్వర్యంలో 324, ఐకేపీ మహిళా సంఘాల ద్వారా 127, డీసీఎంఎస్ ద్వారా 10, ఎఫ్ పీవోల ఆధ్వర్యంలో 19 కలిపి మొత్తం 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయాచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు కానీ అవసరమైన గన్ని బ్యాగులు, వేయింగ్ మిషన్లు, మాయిశ్చర్ మిషన్లు, హమాలీలను సమకూర్చకపోవడంతో వడ్లతూకం మొదలు కావడం లేదు. రామాయంపేట మండలంలో మొత్తం 13 సెంటర్స్ ఉండగా అందులో 9 పీఏసీఎస్, 4 ఐకేపీ కేంద్రాలు. వీటిలో ఒక్క సెంటర్ లో కూడా కొనుగోళ్లు స్టార్ట్ కాలేదు. దాదాపు 15 రోజులుగా రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కౌడిపల్లి మండలంలో పీఏసీఎస్ 11, ఐకేపీ12, డీసీఎంఎస్ 3 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ప్రారంభించి మూడు రోజులు కావస్తున్నా లేబర్ సమస్యతో తూకం మొదలవలేదు. దీంతో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది.
సౌలతులు కరువు..
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నీడ, తాగునీరు, వసతి, కరెంట్ లేక రైతులు అవస్థలు పడుతున్నారు. సమీపంలో ఎక్కడైనా చెట్లు ఉంటే అక్కడికి వెళ్లి కూర్చుంటున్నారు. ఇంటి నుంచి వచ్చేటపుడు బాటిళ్లలో నీరు తెచ్చుకుంటున్నారు. ఇక కేంద్రాల వద్ద సిబ్బంది ఎవరూ లేక రైతులే రాత్రి సమయాల్లో వడ్లకు కాపలాగా ఉంటున్నారు.
వడగళ్ల వానతో నష్టం
గత రెండు, మూడు రోజులుగా ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం పడుతోంది. నిజాంపేట, చేగుంట, కౌడిపల్లి, కొల్చారం మండలాల్లో వర్షానికి ధాన్యం తడిసింది. మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తొందరగా వడ్లు కొనాలి
వడ్లు తొందరగా కొంటే బాగుంటుంది. లేదంటే వానకు తడిస్తే మొలకలు వస్తాయి. ఎండపెడితే టాపర్ల కిరాయి తడిసి మోపెడవుతుంది. చేసిన కష్టం చేతికి రాకుండా పోతుంది.
పెరమండ్ల దుర్గమ్మ, రైతు, మహమ్మద్ నగర్
హమాలీల కొరత ఉంది
రెండు మూడు చోట్ల కొనుగోళ్లు మొదలయ్యాయి. హమాలీలు రాకపోవడంతో కొద్దిగా ఆలస్యం జరుగుతోంది. రేపు, ఎల్లుండి వరకు అన్ని కేంద్రాల్లో కొనుగోలు మొదలవుతాయి. రైతులు ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్, మహమ్మద్ నగర్