- ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడితే ఇక నాన్ బెయిలబుల్ కేసులు
- నిరుడు 610 కేసులు పెట్టి 1,198 మందిని అరెస్ట్ చేసినా ఆగని దందా
- జమ్మికుంట, మానకొండూరు పరిధిలో వందలాది ట్రాక్టర్లతో అక్రమ రవాణా
కరీంనగర్, వెలుగు: ఇసుక అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు ఇకపై ఉక్కుపాదం మోపనున్నారు. వందలాదిగా కేసులు పెట్టి, అక్రమార్కులను అరెస్టు చేస్తున్నా వారు జైలు నుంచి వచ్చాక మళ్లీ దందాను కొనసాగిస్తుండడం పోలీసులకు తలనొప్పిగా మారింది.
బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తుండడంతోనే ట్రాక్టర్ల ఓనర్లు, డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని భావించిన పోలీసులు.. రిపీటెడ్ గా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులపై ఇక మీదట నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని నిర్ణయించారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ర్యాష్ డ్రైవింగ్ తో పోలీసులకే చుక్కలు..
ఇసుక లోడుతో బయల్దేరిన ట్రాక్టర్ డ్రైవర్లు ఓవర్ స్పీడ్ తో డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్డు వెంట వెళ్లే వాహనదారులతోపాటు బాటసారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కరీంనగర్ - పెద్దపల్లి జిల్లాల సరిహద్దులోని గర్రెపల్లి వద్ద ఇసుక లోడు వస్తున్న ట్రాక్టర్ ను ఆపేందుకు ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రయత్నించగా.. డ్రైవర్ ఆపకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లినట్లు తెలిసింది. ట్రాక్టర్ స్పీడ్ చూసి కానిస్టేబుళ్లు పక్కకు తప్పుకోవడంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు సమాచారం.
దీంతో ట్రాక్టర్ ను వెంబడించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు, చట్టమంటే ఇసుక అక్రమ రవాణాదారులకు భయం లేకుండా పోయిందని, వారిలో మార్పు తీసుకొచ్చేందుకు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయానికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది.
610 కేసులు పెట్టినా దందా ఆగలే..
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగింది. పోలీసాఫీసర్లకు మామూళ్లు ముట్టజెబుతూ బీఆర్ఎస్ లీడర్లు ఇసుక దందా నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో వందలాది ఇసుక ట్రాక్టర్లు.. లక్షలాది ట్రిప్పుల ఇసుక రవాణా చేసినా 2023లో కేవలం 27 కేసులు మాత్రమే నమోదయ్యాయంటే పోలీస్ వ్యవస్థ పనితీరు ఏ రకంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కానీ కరీంనగర్ సీపీగా అభిషేక్ మహంతి బాధ్యతలు చేపట్టాక 2024లో ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపారు.
2023లో 120 మందిని అరెస్ట్ చేసి, 244 వెహికల్స్ ను మాత్రమే సీజ్ చేస్తే.. తర్వాతి సంవత్సరం ఇసుక అక్రమరవాణాదారులపై ఏకంగా 610 కేసులు నమోదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లు కలిపి 1,198 మందిని అరెస్ట్ చేశారు. అలాగే 797 వాహనాలను సీజ్ చేశారు. 2023తో పోలిస్తే.. 2024లో ఇసుక అక్రమ రవాణా కట్టడికి పోలీసులు ఏ స్థాయిలో శ్రమించారో గణాంకాలను బట్టి అర్థమవుతోంది. అయినా దందా ఆగకపోవడంతో ఈ ఏడాది మరింత కఠినంగా వ్యవహరించాలని పోలీసాఫీసర్లు నిర్ణయించినట్లు
తెలిసింది.
పోలీసులపై ట్రాక్టర్ ఓనర్ల నిఘా..!
సాధారణంగా అక్రమార్కులపై పోలీసులు నిఘా పెడుతుంటారు. కానీ జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం పోలీసుల మీదే ఇసుక అక్రమ రవాణాదారులు నిఘా పెట్టి.. తమ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచే స్టేషన్ పరిసరాల్లో తచ్చాడుతూ పోలీస్ జీప్ ఎప్పుడు బయటికెళ్లేది బ్లూకోల్ట్, ఐడీ పార్టీ సిబ్బంది ఎటు వెళ్లేది పసిగడుతూ ట్రాక్టర్ డ్రైవర్లకు సమాచారం ఇస్తున్నారు. ఇలా గాంధీ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు సుమారు పది, 15 మంది ఇదే పనిలో ఉంటున్నట్లు తెలిసింది.
అంతేగాక కొందరు పోలీస్ సిబ్బంది కూడా ఇసుక మాఫియాకు ఇన్ ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఈ స్టేషన్ పరిధిలో ఇసుక ట్రాక్టర్ల సీజ్ వ్యవహారంపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాక్టర్లను సీజ్ చేసిన తర్వాత తహసీల్ ఆఫీస్‌కు అప్పగించాల్సి ఉండగా.. అలా చేయడం లేదు. దీంతో ట్రాక్టర్ ఓనర్లు కోర్టుకు వెళ్లి ఫైన్ కట్టి, రిలీజ్ ఆర్డర్ తెచ్చుకుని ట్రాక్టర్లు తీసుకెళ్తున్నారు. వాస్తవానికి అందులో ఇసుకను డంప్ చేసి.. ఖాళీ ట్రాక్టర్ ను మాత్రమే ఇవ్వాల్సి ఉండగా ఇసుకతో సహా ఇచ్చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.