- మీ పార్టీలో దళితులెవరూ అధ్యక్ష పదవికి అర్హులు కారా?
- హుజూరాబాద్ లో ఓటమి ఖాయమనే ప్లీనరీ పేరుతో సీనరీ
కరీంనగర్, వెలుగు: ‘‘టీఆర్ఎస్ లో దళితులెవరూ అధ్యక్ష పదవికి అర్హులు కారా? కేసీఆరే సీఎంగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉంటారా? పార్టీ పెట్టినప్పటి నుంచి 20 ఏండ్లుగా కేసీఆరే అధ్యక్షుడిగా ఉంటారా? రేపు కూడా మళ్లా ఆయనే కొనసాగుతారా? ఇదేం విడ్డూరం. కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, కూతురు సిట్టింగ్ ప్రెసిడెంట్, అల్లుడు స్టాండింగ్ ప్రెసిడెంట్, మరదలి కొడుకు సంతోశ్ రావు స్లీపింగ్ ప్రెసిడెంట్‌గా ఉంటూ పార్టీని ఏలుతున్నరు. కేసీఆర్.. ఇన్నాళ్లూ దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసినవ్. ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని, మూడెకరాల భూమి ఇస్తానని, దళిత బంధు ఇస్తానని మోసం చేసినవ్. రేపటి ప్లీనరీలో టీఆర్ఎస్ అధ్యక్ష పదవినైనా దళితుడికి అప్పగించి చిత్తుశుద్ధి నిరూపించుకుంటావా? నీకా దమ్ముందా?” అని బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. ఆదివారం హుజూరాబాద్ లోని ఇల్లందకుంట మండలం రాచపల్లి, టేకుర్తి గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు. హుజూరాబాద్‌లో ఓడిపోతామని తెలిసే, ఎన్నికను చిన్నదిగా పేర్కొంటూ.. పార్టీ ప్లీనరీ పేరుతో సీనరీ క్రియేట్ చేస్తున్నారని సంజయ్ అన్నారు. దుబ్బాక, నాగార్జున సాగర్ ఎన్నికలు పెద్దవైనప్పుడు.. హుజూరాబాద్ ఎన్నిక ఎట్ల చిన్నదవుతుందని ప్రశ్నించారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా పై కేసీఆర్ ఫొటోను ప్రదర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
పోడు భూములపై కొత్త డ్రామా..
పోడు భూములకు పట్టాలిస్తామంటూ కేసీఆర్ మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టిండని సంజయ్ మండిపడ్డారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ మాయ మాటలు చెబుతూ మోసం చేస్తున్నాడని అన్నారు. ‘‘ఈటల రాజేందర్ కొట్టిన దెబ్బకు కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదు. నవంబర్ 2న ప్రగతి భవన్ ముందు కేసీఆర్‌కు ‘‘ట్రిపుల్ ఆర్’’ (రాజాసింగ్, రఘునందన్, రాజేందర్) సినిమా చూపిస్తం” అని అన్నారు. కేసీఆర్ ఓట్లను డబ్బులతో కొంటున్నారని, ఓటుకు రూ.20 వేల చొప్పున పంపించారని.. అయితే అందులో టీఆర్ఎసోళ్లు రూ.15 వేలు దాచుకొని ఓటర్లకు 5 వేలే ఇస్తున్నారన్నారు.