- ప్రైవేట్ ఆస్పత్రుల కాసుల కక్కుర్తి
- నార్మల్ డెలివరీలకు బదులు సీజేరియన్లు
- ప్రభుత్వాస్పత్రుల్లోనూ పెరిగిన ఆపరేషన్ల సంఖ్య
యాదాద్రి, వెలుగు : ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు కాసుల కోసం కక్కుర్తి పడి నార్మల్ డెలివరీలకు బదులు సిజేరియన్లు చేస్తున్నారు. నెలలు నిండిన గర్భిణి ఆస్పత్రికి వస్తే చాలు ఆపరేషన్ చేయాల్సిందేనని.. లేకుంటే తల్లి, బిడ్డకు ప్రాణాపాయం అంటూ గర్భిణుల కడుపును నిలువున కోసి బిడ్డను బయటకు తీస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలోనూ కొందరు డాక్టర్లకు ఇదే జాడ్యం అంటుకుంది. నార్మల్కోసం వెయింట్ చేయడమెందుకని ఆపరేషన్లు చేస్తున్నారు.
ఐదేండ్లలో 30,488..
ట్రీట్మెంట్ కోసం గర్భిణులు గవర్నమెంట్ ఆస్పత్రుల్లో పేర్లు నమోదు చేయించుకున్నా.. డెలివరీ టైమ్‌కు ప్రైవేట్ కు వెళ్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 42,005 డెలివరీలు అయ్యారు. వీరిలో 30,488 మందికి ఆపరేషన్లు చేసి బిడ్డలను బయటకు తీశారు. ఏవరేజ్‌గా ప్రతి 100 మందిలో 72 మందికి ఆపరేషన్లు చేయగా, 28 మంది నార్మల్డెలివరీ అవుతున్నారు. నార్మల్డెలివరీ అయితేనే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, అందుకు నార్మల్ డెలివరీలను పెంచాలని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రచారం చేస్తోంది. కానీ ఆ దిశగా పనిచేయకపోవడంతో ఫలితం కన్పించడం లేదు.
ఏటీఎంలుగా గర్భిణులు..
ట్రీట్మెంట్ కోసం వచ్చిన గర్భిణులను కొందరు ప్రైవేట్డాక్టర్లు ఏటీఎంగా భావిస్తున్నట్టుగా కన్పిస్తోంది. రకరకాల టెస్ట్‌లు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. డెలివరీ సమయం దగ్గర పడుతుండడంతో భయాందోళనకు గురిచేస్తున్నారు. దీంతో పేరెంట్స్ఆపరేషన్కు ఓకే చెప్పడం, గర్భిణులు కూడా అందుకు సిద్ధపడుతున్నారు. ఒక్కో ఆపరేషన్‌కు ఆస్పత్రి స్థాయిని బట్టి రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు తీసుకుంటున్నారు. ఆపరేషన్ చేయించుకున్న మహిళలు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఐదేండ్లలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో 22,029 మంది డెలివరీ కాగా, వీరిలో 2,644 మంది నార్మల్ డెలివరీలు, 19,385 మందికి ఆపరేషన్లు అయ్యాయి. ఈ లెక్కన ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రతి 100 మందిలో 88 మందికి ఆపరేషన్లు చేస్తున్నారు.
ALSO READ : ఆర్‌ఎఫ్‌సీఎల్ యూరియా అమ్ముడుపోతలే..కేంద్ర సబ్సిడీ వస్తలే !
ప్రభుత్వాస్పత్రులోనూ..
ప్రభుత్వాస్పత్రుల్లోనూ గతంతో పోలిస్తే ఆపరేషన్ల సంఖ్య పెరిగింది. 100 మందిలో 56 మందికి ఆపరేషన్లు చేస్తున్నారు. నార్మల్డెలివరీ చేయాలంటే.. ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటున్నందున ఆపరేషన్ చేస్తున్న సంఘటనలూ ఉన్నాయి. కొందరు గర్భిణులు కూడా నొప్పులు తట్టుకోలేక ఆపరేషన్ చేయాలని డాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఐదేండ్లలో 19,976 మంది డెలివరీ కాగా, 8,873 మంది నార్మల్, 11,103 మందికి ఆపరేషన్లు చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రులో..
సంవత్సరం డెలివరీ నార్మల్ సిజేరియన్ 2020-21 5501 2241 3260
2021-22 5642 2197 3445
2022-23 3551 1536 2015
2023-24 3366 1828 1538
2024-25 1916 1071 845
ప్రైవేట్ఆస్పత్రుల్లో..
2020-21 5093 546 4547
2021-22 5557 550 5007
2022-23 4672 533 4139
2023-24 3804 643 3161
2024-25 2903 372 2531