దొడ్డి కొమురయ్య బయోపిక్ షూటింగ్ ప్రారంభం

దొడ్డి కొమురయ్య బయోపిక్ షూటింగ్ ప్రారంభం
  • ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి, వీరారెడ్డి సారథ్యంలో నిర్మాణం
  • క్లాప్ కొట్టి ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గడీలో లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొబ్బరికాయ కొట్టి షూటింగ్ను ప్రారంభించారు. వీఆర్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, వీరారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య వీరోచితంగా పోరాడారన్నారు. రజాకార్లు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమురయ్య వీర మరణం పొందారని, ఆయన వీర మరణం తర్వాతే సాయుధ పోరాటం ఊపందుకుందన్నారు. దొడ్డి కొమురయ్య జీవితం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా నిర్మిస్తుండటం గొప్ప విషయమన్నారు. తెలంగాణ అమరవీరుల చరిత్ర భావితరాలకు తెలిసేలా సినిమాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తోందని చెప్పారు. సినిమా నిర్మాణం త్వరగా పూర్తయి సినిమా మంచి విజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. జూలై 1న సినిమా విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఇవి కూడా చదవండి..

 

కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు

కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి