- అయిదేళ్ల బాలునికి, మరొకరికి తీవ్రగాయాలు
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్‌లో బుధవారం కుక్కలు స్వైర విహారం చేశాయి. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో కుక్కల దాడిలో అయిదు సంవత్సరాల బాలుడు వివన్స్, బాలిక హన్సిక తీవ్రంగా గాయపడ్డారు. కుక్కలు బాలుడి ఎడమ చెంపను కొరికివేశాయి. అదే సమయంలో అక్కడే ఉన్న కిశోర్ (35) అనే వ్యక్తిని కుక్కలు కరిచి గాయపరిచాయి.
గాయపడిన ఇద్దరిని కుటుంబీకులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆర్మూర్‌లో ఇటీవల కుక్కల బెడద తీవ్రమైంది. మూడు నెలల క్రితం శివాజీ చౌక్, గోల్ బంగ్లా, పెద్దబజార్, చిన్నబజార్ సమీపంలో ఒకే రోజు కుక్కలు 11 మంది చిన్నారులను గాయపరిచాయి. బుధవారం ఒకేరోజు ఇద్దరిని కరిచాయి. ఆర్మూర్ లో కుక్కలను నియంత్రించే విధంగా మున్సిపల్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.