
- ఐఎస్‌క్యూయూఏ బోర్డు మెంబర్ అనురాధ
- పీసీఐలో శ్వేత పత్రం రిలీజ్ చేసిన ఆర్గనైజేషన్ ప్రతినిధులు
న్యూఢిల్లీ, వెలుగు: సరైన వైద్యం అందక దేశంలో ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ క్వాలిటీ ఇన్ హెల్త్ కేర్(ఐఎస్‌క్యూయూఏ) సంస్థ బోర్డు మెంబర్ డాక్టర్ అనురాధ పిచుమణి అన్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్యం, రోగికి భద్రత కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ)లో సంస్థ ప్రతినిధులతో కలిసి పేషెంట్ సేఫ్టి ఫర్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ అంశంపై ‘శ్వేతపత్రం’ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2024లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) విడుదల చేసిన నివేదిక ఆధారంగా హెల్త్ సెక్టార్‌లో రోగి భద్రత, నాణ్యమైన వైద్యం కోసం తీసుకోవాల్సిన అంశాలతో వైట్ పేపర్ తయారు చేసినట్లు చెప్పారు. పాశ్చాత్య దేశాలతో పాటు ఇండియాలోనూ ఈ మార్గదర్శకాలు పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నెల మొదటి వారంలో ‘పేషెంట్ సేఫ్టీ’ అంశంపై పిలిఫ్పిన్స్‌లోని జరిగిన 7వ గ్లోబల్ మినిస్ట్రిరియల్ సమిట్‌లో ఆరోగ్య సంరక్షణ సంస్థల కోసం ఈ వైట్ పేపర్‌ను రూపొందించి, రిలీజ్ చేసినట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా వైద్యం మెరుగుపరచడం, హెల్త్ కేర్ రక్షణపై గత 30 ఏండ్లుగా తాము పోరాడుతున్నట్లు డాక్టర్ షిన్ ఉషిరో (జపాన్) తెలిపారు. జపాన్‌లోని తన హాస్పిటల్‌లోనూ ఈ మార్గదర్శకాలను పాటిస్తూ.. లక్షలాది మంది రోగుల రక్షణ, నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది బ్రెజిల్ వేదికగా అక్టోబర్ 12–15 వరకు ఐఎస్‌క్యూయూఏ 41వ ఇంటర్నేషనల్ సమిట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.