
- ఘనంగా బాబా సాహెబ్ జయంతి వేడుకలు
నెట్వర్క్, వెలుగు: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దా మని వక్తలు పిలుపునిచ్చారు. అంబేద్కర్134వ జయంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. బాబాసాహెబ్ అందరివాడు అని, ఆయన జీవితం ఆదర్శప్రాయమని కొనియాడారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా, మాజీ మంత్రి జోగు రామన్న, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆసిఫాబాద్ కలెక్టరేట్లో జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అడిషనల్కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాళులర్పిం చారు. కులాంతర వివాహం చేసుకున్న పలు జంటలకు రూ.2.50 లక్షల బాండ్లు అందజేశారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలను నేతలు ఆవిష్కరించారు. దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు.