అక్షర ప్రపంచం ; ఆమె బయోగ్రఫీలో.. ఎన్నో కథలు

ఒక  ఎన్జీవోతో మొదలైన తన ప్రయాణం.. రాష్ట్రపతి అవార్డు అందుకునే వరకు ఎలా సాగింది అనేదే ఈ పుస్తకంలో రాశారు డాక్టర్ కల్పనా శంకర్. ఆమె మద్రాస్​ యూనివర్సిటీ నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్‌‌లో పిహెచ్‌‌డి పట్టా అందుకున్నారు. చేసేది గవర్నమెంట్ ఉద్యోగం, భర్త జిల్లా కలెక్టర్. ఉండడానికి పెద్ద ఇల్లు.. సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ.. ఆమె 2004లో తమిళనాడులోని కాంచీపురంలో అద్దెకు తీసుకున్న ఒక చిన్న రెండంతస్తుల ఇంట్లో ఎన్జీవో పెట్టారు. 

ఆ అడుగే ఆమెని భారత రాష్ట్రపతి నుండి అవార్డు అందుకోవడానికి దారితీసే ప్రయాణానికి నాంది పలికింది. ఆ ఎన్జీవో ద్వారా కల్పన చేసిన పోరాటాలను తన బయోగ్రఫీ “ది సైంటిస్ట్ ఎంట్రప్రెన్యూర్” లో రాశారు. కల్పనా శంకర్ ముఖ్యంగా పేద పిల్లలకు విద్యను అందించేందుకు పనిచేశారు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ పుస్తకంలో కాంచీపురంలోని పట్టు నేసే మగ్గాల్లో పనిచేసే బాల కార్మికుల గురించి వివరంగా రాశారు. అప్పుల బారిన పడిన పిల్లల హృదయ విదారక గాథలను పంచుకున్నారు. 

ఇలాంటి పేదరికం గురించిన కథలు ఇందులో ఎన్నో ప్రస్తావించారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎంతోమంది పిల్లలను కాపాడారు కల్పన. వాళ్లను స్కూళ్లలో చేర్పించడానికి, మంచి మార్గంలో నడిపించడానికి కృషి చేశారు. ఇలా ఆమె చేసిన మంచి పనులే ఆమెకు 2019లో భారత రాష్ట్రపతి నుంచి ‘బాల కళ్యాణ్’పురస్కారం దక్కేలా చేశాయి.