ముళ్ల పొదల్లో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్..రోడ్లు వేసి వదిలేసిన వైనం

 

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్ ఆర్టీఏ ఆఫీసులో నిర్మించిన  డ్రైవింగ్​ టెస్ట్​ట్రాక్​ అక్కరకు రాకుండా పోయింది. రాష్ట్ర ఖజానాను నింపే ఆర్టీఏకు సర్కార్ ఫండ్స్​విడుదల చేయకపోవడంతో సీసీ కెమెరాలు, సిగ్నల్స్, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు.  పనులు పూర్తి కాకపోవడంతో డ్రైవింగ్​ టెస్ట్ ట్రాక్​ వినియోగంలో లేకుండా పోయింది. ట్రాక్​ మొత్తం ముళ్లపొదలతో నిండిపోయింది. దీంతో డ్రైవింగ్ టెస్టులు సమీపంలోని ఖాళీ ప్లేస్ లో నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో ఆ ప్రాంతమంతా నీళ్లు, బురద నిండిపోతోంది. దీంతో ఇటు వాహనదారులు, అటు ఎంవీఐలు ఇబ్బందులు పడుతున్నారు. 

మూడేళ్లయినా పూర్తికాని పనులు..

ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్న కరీంనగర్‌‌లో ఇప్పటివరకు డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ లేదు. 2019లో ప్రభుత్వం ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టింది. రోడ్లు, డివైడర్ల నిర్మాణం పూర్తయింది. 8, హెచ్ ట్రాక్ ల నిర్మాణం, సీసీ కెమెరాలు, సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ లోపు కరోనా వ్యాప్తి చెందడం, నిధులు లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. రూ.15 లక్షలు మంజూరు చేస్తే పెండింగ్ వర్క్స్ పూర్తి కానున్నాయి. సర్కార్  ఖజానాకు రూ.కోట్ల ఆదాయమిచ్చే ఆర్టీఏకు కేవలం రూ.15 లక్షలు లేకపోవడంతో పనులు ముందుకు సాగకపోవడం గమనార్హం. 

ఓపెన్​ ప్లేస్‌లో టెస్టులు.. 

కరీంనగర్ జిల్లా పరిధిలోని 16 మండలాల ప్రజలు డ్రైవింగ్ టెస్టులు, వెహికిల్స్ రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ కోసం ఇక్కడి ఆర్టీఏకు వస్తుంటారు. డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా వచ్చిందా? లేదా? అని తెలుసుకునేందుకు 8, హెచ్ ట్రాక్ లపై డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ట్రాక్ ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఆర్టీఏ ఆవరణలోని ఖాళీ స్థలంలో టెస్టులు నిర్వహిస్తున్నారు. రాళ్లు హద్దులుగా పెట్టి డ్రైవింగ్ టెస్టులు చేయిస్తున్నారు. ఓపెన్ ప్లేస్ కావడంతో డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారా లేదా అనే విషయం 
తెలియడం లేదు. 

ప్రభుత్వానికి  ప్రతిపాదనలు పంపాం.. 

టెస్ట్ ట్రాక్ లో 8, హెచ్ ట్రాక్ ల నిర్మాణం, సీసీ కెమెరాలు, సిగ్నల్స్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. రూ.15 లక్షలు  మంజూరైతే పనులు పూర్తవుతాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు పూర్తి చేసి ట్రాక్ ను వినియోగంలోకి తీసుకొస్తాం. 

– మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్,  డీటీసీ, కరీంనగర్