డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 టీచర్ పోస్టులకు ఖాళీగా ఉన్న మిగతా 15 వేల పోస్టులు జత చేసి 20 వేల టీచర్ పోస్టులకు మెగా డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి షెడ్యూల్ ఇవ్వాలి. లక్షలాది మంది అభ్యర్థులు గత ఏడు సంవత్సరాలుగా టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకొని లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే లోపే డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇప్పటికే 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అనుబంధ నోటిఫికేషన్ జారీచేసి గతంలో అప్లై చేయని అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి. దీంతో మరో లక్షమంది అభ్యర్థులు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. పరీక్షలు ఆన్ లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించాలి.
టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్, టెట్ ప్రక్రియకి, డీఎస్సీకి ముడిపెట్టకుండా అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఒకవేళ ప్రభుత్వం టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ చేపట్టాలనుకుంటే.. డీఎస్సీ షెడ్యూల్ ఇచ్చి పరీక్షలకు 4 లేదా 5 నెలల సమయం ఇచ్చి ఆలోపు టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఖాళీగా ఉన్న ప్రాథమిక స్థాయి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, వ్యాయామ టీచర్లు, స్పెషల్ టీచర్ పోస్టులు, ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు, ఉర్దూ టీచర్ల పోస్టులు అన్ని ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ప్రమోషన్స్ ప్రక్రియలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ స్థాయిలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తే బీఎడ్ నిరుద్యోగులకు కొంత న్యాయం జరుగుతుంది.
రావుల రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.