హైదరాబాద్, వెలుగు : ఐజీ స్టీఫెన్ రవీంద్రపై డీఎస్పీ గంగాధర్ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. భూవివాదం కేసులో తనను అక్రమంగా సస్పెండ్ చేశారని, ఎలాంటి విచారణ లేకుండా ఏడాదిన్నర కాలం సర్వీస్ కోల్పోయేలా చేశారని ఆరోపించారు. ఈ మేరకు మార్చి13న సీఎంతో పాటు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఓపీటీకి వరుస కంప్లైంట్స్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంగాధర్ ఫిర్యాదు ప్రకారం..సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర ఉన్నప్పుడు గంగాధర్ నార్సింగి ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పరిధిలోని గ్రామాల మధ్య ఓవర్ లాప్ భూ వివాదం కేసులు చేశారు.
ALSO READ ; క్లౌడ్- 9 లాంజ్ హుక్కా సెంటర్‌పై పోలీసుల రైడ్
సివిల్ వివాదాల్లో తలదూర్చాడంటూ గంగాధర్‌ను సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశారు. ఆపై ఏడాదిన్నర పాటు ఎలాంటి విచారణ జరుపలేదని గంగాధర్ ఆరోపించారు. ఈ కారణంగా తన బ్యాచ్ ఇన్‌స్పెక్టర్లకు ముందే డీఎస్పీలుగా ప్రమోషన్స్ దక్కినా తనకు మాత్రం రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రమోషన్ ను కన్సిడర్ చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా.. స్టీఫెన్ రవీంద్ర పట్టించుకోలేదని తెలిపారు. దీంతో సర్వీస్‌లో ఏడాదిన్నర కాలం నష్టపోయినట్లు వివరించారు. డిపార్ట్‌మెంట్ పరంగా తనకు తగిన న్యాయం చేయాలని గంగాధర్ సీఎంను కోరారు.