- ఘనంగా శమీ పూజలు
- అబ్బురపరిచిన రాంలీలా వేడుకలు
నెట్వర్క్, వెలుగు: దసరా వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. శమీ పూజలు చేశారు. జంబి ఆకు ఇచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన రాంలీలా ఉత్సవాలకు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి–సరోజ దంపతులు హాజరై ప్రారంభించారు. ముందుగా స్థానిక వెంకటేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్–స్వరూపరాణి దంపతులు, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం స్వామివారిని పల్లకిలో రాంలీలా వేదికైన సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌కు తీసుకువ చ్చారు.
తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు, జాతీయ కళాకారుడు అంతడుపుల నాగరాజు ఆధ్వర్యంలో కళాకారుల కల్చరల్ప్రోగ్రామ్స్అలరించాయి. అనంతరం 30 అడుగుల భారీ రావణాసురుడి బొమ్మ దహన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వివేక్–సరోజ దంపతులు ప్రారంభించారు. బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ క్రీడా మైదానంలో రావణసుర వధ కార్యక్రమానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్-–రమాదేవి దంపతులు, ఎమ్మెల్యే వివేక్ దంపతులతో పాటు సరస్వతి విద్యాపీఠం విభాగ్ కార్యదర్శి గోవిందరాజులు హాజరై విజయ దశమి వేడుకలను ప్రారంభించారు. మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, మున్సి పల్ మాజీ చైర్మన్లు మునిమంద స్వరూప-రమేశ్ దంపతులు, మత్తమారి సూరిబాబు, సరస్వతి విద్యాపీఠం పూర్వ విద్యార్థి పరిషత్ స్టేట్ సెక్రటరీ బొడ్డు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటుంది
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ మైదానం, డైట్మైదానంలో, కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీ గొడం నగేశ్, ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ గౌస్ ఆలం, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్అసెంబ్లీ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయం వద్ద జరిగిన వేడుకల్లో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
జమ్మి చెట్టుకు పూజలు చేసి ఆయుధ పూజ నిర్వహించారు. రావణుడి దహన కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన వందలాదిమందితో మహాలక్ష్మి ఆలయ గ్రౌండ్ కిటకిటలాడింది. చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటుందని, ఆ విజయానికి దసరా పండుగ నిదర్శనమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్ పట్టణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సంబరాలు జరగ్గా బొజ్జు పటేల్ పాల్గొన్నారు.
భైంసాలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది. పురాణ బజార్, భవాని చౌక్ వద్ద ప్రతిష్టించిన దుర్గామాతలకు ఎస్పీ జానకి షర్మిల, ఎమ్మెల్యే రామారావు పటేల్, ఏఎస్పీ అవినాశ్ కుమార్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు కాశీనాథ్ తదితరులు ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. నేరడిగొండ మండలంలోని బొందిడి గ్రామంలో నిర్వహించిన ఉత్సవాల్లో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జ్ ఆడే గజేందర్ పాల్గొన్నారు.