హైదరాబాద్, వెలుగు: బాసర ట్రిపుల్‌ఐటీలో ఎకో పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్జీయూకేటీ ఇన్చార్జ్ వీసీ వెంకటరమణ తెలిపారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో 4 ఎకరాలలో వివిధ రకాల ఔషధ, పండ్ల మొక్కలను నాటుతామన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న.. వర్సిటీలో 2వేల మందితో శ్రమదానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఉన్నత విద్యా మండలి ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
2022 – 23 విద్యా సంవత్సరానికి సంబంధించి 1,500 సీట్ల అడ్మిషన్ల ప్రక్రియ ముగింపు దశలో ఉందని తెలిపారు. అడ్మిషన్లు పొందిన వారిలో 73% మంది అమ్మాయిలే ఉన్నారని చెప్పారు. స్టూడెంట్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పీయూసీ పూర్తయి ఇంజినీరింగ్‌లో చేరే స్టూడెంట్లకు త్వరలోనే ల్యాప్‌టాప్‌లు అందిస్తామని వివరించారు. దీనికోసం సర్కారుకు ప్రతిపాదనలు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు.