మానిటైజేషన్‌తో ఎకానమీ పరుగు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘జాతీయ ఆస్తుల నగదీకరణ (మానిటైజేషన్)’  పథకంతో దేశంలో కొత్త పెట్టుబడులతోపాటు ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. ఉపయోగంలో లేని, వృథాగా ఉంటున్న ప్రభుత్వ ఆస్తుల నిర్వహణను ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం నాలుగేండ్లలో రూ. 6 లక్షల కోట్లను సమకూర్చుకోనుంది. ఆ మొత్తాన్ని మళ్లీ మౌలిక వసతుల కల్పనకే వెచ్చిస్తే.. 
దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడనుంది. 

దేశంలో సమకూరిన మౌలిక వసతులను బట్టి ఆ దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయవచ్చు.  జల, రోడ్డు,  రైలు, విమానయాన రంగాల అభివృద్ధి, విద్యుత్ వ్యవస్థ, సులభతర వ్యాపారం మొదలైనవి ఆ దేశ ప్రగతికి అద్దం లాంటివి. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసిన ఎన్డీఏ ప్రభుత్వం ‘భారత మాల పరియోజన’ అనే బృహత్తర కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. అంతర్జాతీయ రవాణా, వివిధ రాష్ట్రాల మధ్య వ్యాపారం ఆగిపోయింది. వలస కార్మికులు మొదలుకుని దినసరి కూలీల వరకు, పెద్ద పరిశ్రమల నుంచి ఎంఎస్ఎంఈ సెక్టార్ల దాకా అన్నీ మూతపడి, లక్షల్లో ఆదాయాలు కోల్పోయాయి. పేదరికం, నిరుద్యోగం మరింత పెరిగాయి. కరోనా గడ్డు పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకే  కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర భారత్’ పేరుతో ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. ప్రజారోగ్యం దృష్ట్యా హెల్త్​ డిపార్ట్​మెంట్ కు ఎక్కువ నిధులు వెచ్చించింది. ప్రతి భారతీయుడికి ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు దాదాపు రూ. 40 వేల కోట్లను ఖర్చు చేస్తోంది. 

ఆరు లక్షల కోట్లు..

కరోనా పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూనే ఎనానమీకి ఊతమిచ్చే కార్యక్రమాలను కేంద్రం  కొనసాగిస్తోంది. ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించేందుకు ఆగస్టు నాలుగో వారంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ ‘జాతీయ ఆస్తుల నగదీకరణ’ పథకం ప్రారంభించారు. నాలుగేండ్లలో రూ.6 లక్షల కోట్లను ఆర్జించి దేశంలో మౌలిక వసతులు మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉపయోగంలో లేని, వృథాగా ఉంటున్న ప్రభుత్వ ఆస్తుల విలువను పెంచడమే జాతీయ నగదీకరణ లక్ష్యం. ఆస్తుల నగదీకరణ కోసం నేషనల్ మానిటైజేషన్ పైప్‌‌‌‌లైన్ తీసుకువస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా సమకూరే నిధులను మళ్లీ మౌలిక వసతుల కల్పనకే వెచ్చిస్తామన్నారు. 

మానిటైజేషన్​ అంటే అమ్మకం కాదు

మానిటైజేషన్ అంటే అమ్మకం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు కొంతకాలానికి లీజ్ కి ఇచ్చి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని, తద్వారా వచ్చే ఆదాయాన్ని దేశం మొత్తంలో వివిధ సేవల కోసం ఖర్చు చేయాలని భావిస్తోంది. ప్రైవేటు పరిశ్రమలకు ఇస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు అంతిమంగా ప్రభుత్వ యాజమాన్యం కిందే  ఉంటాయని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే గాకుండా కరోనా మహమ్మారి వల్ల ఆగిపోయిన అభివృద్ధి పనులను వేగవంతం చేయనుంది. నిరర్థక ఆస్తులను వాణిజ్యానికి అప్పగించడం లాభసాటి చర్య అనేది కేంద్రం భావన. 12 ప్రభుత్వ శాఖలకు చెందిన 20కి పైగా ఆస్తులు ఈ నగధీకరణలో భాగంగా ఉంటాయి. వీటిలో ప్రధానంగా రహదారులు, రైల్వేలు, విద్యుత్ వ్యవస్థలు ఉన్నాయి. 2022 నుంచి 2025 వరకు ఈ కార్యక్రమం అమలవుతుంది. మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చును ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వరంగ మౌలిక వసతుల ఆస్తులను ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించడం అతి ముఖ్యమైన ఆర్థిక సంస్కరణ అని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ నగదీకరణ వల్ల నాలుగు ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల రాబడులు పెంచవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే బడ్జెటరీ మద్దతును తగ్గించవచ్చు. కొత్త మౌలిక వసతుల కల్పనకు నిధుల లభ్యతను పెంచుకోవచ్చు. కొత్త ఉద్యోగాలకు, పెట్టుబడులకు అవకాశం కల్పించవచ్చు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.100 లక్షల కోట్ల విలువైన మౌలిక వసతుల కల్పనను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో సాగే ఈ పద్ధతి వల్ల కార్పొరేట్ రంగం ఆకాంక్షలకు ఊతం లభిస్తుంది.  ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ ఆస్తులు ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇంతవరకు వృథాగా పడి ఉన్న ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం వల్ల వారు సమర్థంగా ఉపయోగిస్తే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా రైల్వే, హైవేల్లో ఏక కేంద్ర ఆధిపత్యం తగ్గుతుంది.

పథకంపై విమర్శలు

కేంద్రం తీసుకున్న ఆస్తుల నగదీకరణ నిర్ణయంపై కొందరు ఆర్థికవేత్తలు, నిపుణులు, ప్రతిపక్షాల సభ్యులు పెదవి విరుస్తున్నారు. ‘ప్రభుత్వం మౌలిక రంగ ఆస్తులను ఏనాడు సరిగా నిర్వహించ లేదు. వాటి అభివృద్ధిపై పైసా ఖర్చు పెట్టింది లేదు. కేవలం ఇప్పుడు ప్రైవేట్ వ్యాపార సంస్థలకు కట్టబెట్టాలనే  ప్రయత్నంగా దీన్ని తీసుకొచ్చారు’ అని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒకవేళ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే అవి లాభాలను తిరిగి రాబట్టుకునేందుకు అడ్డగోలుగా యూజర్ ఛార్జీలు పెంచుతాయని. దాని వల్ల ప్రజలపై భారం పడుతుందని, ప్రైవేట్ రంగ కార్మికుల సంక్షేమంపై, వారి జీతభత్యాల పై పెట్టే ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉందని ఆరోపిస్తున్నాయి. ప్రైవేట్ రంగానికి మౌలిక రంగ ఆస్తులను కేటాయించాల్సి వస్తే ముందుగా మార్కెట్​లో పోటీతత్వం ఉందో లేదో, వినియోగదారులను అధిక ధరలతో ఇబ్బందికి గురి చేయకుండా చూసేందుకు ప్రభుత్వం బహిరంగ సమీక్షలు జరపాలని ఆర్థిక వేత్తలు కోరుకుంటున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక రెగ్యులేటరీ బాడీని ఏర్పాటు చేసి జవాబుదారీతనంగా,  పారదర్శకతతో పని చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణల వల్ల కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకొని ముందుకు పోతోంది. ఆస్తుల నగదీకరణ పథకాన్ని జాగ్రత్తగా ఆచీ తూచీ అమలు చేస్తూ.. ప్రజల ఆదాయ, వ్యయాలను పెంచేలా తద్వారా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. 

ఏమేం ఆస్తులు వస్తాయి? 

‘నేషనల్‌‌‌‌ మానిటైజేషన్‌‌‌‌ పైప్‌‌‌‌లైన్‌‌‌‌’ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్యమైన, మౌలిక వసతులన్నీ వస్తాయి. 12 శాఖలకు చెందిన 20కి పైగా ఆస్తులు ఇందులో ఉంటాయి. వీటిలో ప్రధానంగా రహదారులు, రైల్వేలు, విద్యుత్తు వ్యవస్థ ఉన్నాయి. 2022 నుంచి 2025 వరకు ఈ కార్యక్రమం అమలవుతుంది. ఆపరేట్‌‌‌‌ మెయింటెన్‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌, టోల్‌‌‌‌ ఆపరేట్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌, ఆపరేషన్‌‌‌‌, మెయింటెనెన్స్‌‌‌‌, డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌, రిహాబిలిటేట్‌‌‌‌ ఆపరేట్‌‌‌‌ మెయింటెయిన్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ విధానాల్లో ఈ ఆస్తులను అప్పగిస్తారు. రైల్వేలో 400 స్టేషన్లు, 90 ప్రయాణికుల రైళ్లు, 1,400 కిలోమీటర్ల ట్రాక్‌‌‌‌, 265 గూడ్స్‌‌‌‌ షెడ్లు, 741 కిలోమీటర్ల కొంకణ్‌‌‌‌ రైల్వే, 4 హిల్‌‌‌‌ రైల్వే, 674 కిలోమీటర్ల డెడికేటెడ్‌‌‌‌ ఫ్రైట్‌‌‌‌ కారిడార్‌‌‌‌, 15 రైల్వే స్టేడియంలను ప్రైవేటుకు అప్పగిస్తారు. ఎయిర్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ అథారిటీ ఆఫ్‌‌‌‌ ఇండియా ఆధ్వర్యంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తారు. ఢిల్లీ, హైదరాబాద్‌‌‌‌, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటాలను పూర్తిగా విక్రయిస్తారు. 9 మేజర్‌‌‌‌ పోర్టుల్లో ఉన్న 31 ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అప్పగిస్తారు. జాతీయ స్టేడియంలు, ప్రాంతీయ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీలు, అతిథి గృహాలు, హోటళ్లు వంటి వాటిని ప్రైవేటుకు అప్పగిస్తారు.

ఆర్. భాస్కర్ రెడ్డి, 
సోషల్ ఎనలిస్ట్