- రూ.48.71 కోట్ల విలువైన స్తిరాస్తుల అటాచ్‌మెంట్
హైదరాబాద్, వెలుగు: బ్యాంకుల కన్సార్షియం నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని, నిధుల మళ్లింపునకు పాల్పడిన ఆరోపణలపై ట్రాన్స్‌స్టోరీ ఇండియా లిమిటెడ్ (టీఐఎల్) ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఇందులో దాదాపుగా రూ.48.71 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. కంపెనీ మోసాలపై హైదరాబాద్ సీబీఐ బ్రాంచ్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
టీఐఎల్ సంస్థ బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు, క్రెడిట్ సదుపాయాల రూపంలో మొత్తంగా రూ.5115 కోట్లు (వడ్డీతో సహా) తీసుకుంది. ఈ మొత్తాలను వాస్తవంగా చూపిన వ్యాపారాలకు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా షెల్ కంపెనీల్లోకి మళ్లించారు. టీఐఎల్ డైరెక్టర్లు/ప్రమోటర్లు ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడ్డారు. టీఐఎల్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను షెల్ కంపెనీల్లో డైరెక్టర్లుగా చూపారు. ఇలా అడ్డగోలుగా నిధుల మళ్లింపునకు పాల్పడడంతోపాటు టీఐఎల్ సంబంధిత సంస్థల బ్యాంక్ ఖాతాల నుంచి రూ. 85.90 కోట్లు నగదు రూపంలో విత్‌డ్రా చేసినట్టు ఈడీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.