సురానా గ్రూప్‌‌ ఆఫ్ కంపెనీల్లో ఈడీ సోదాలు

సురానా గ్రూప్‌‌ ఆఫ్ కంపెనీల్లో ఈడీ సోదాలు
  • నిరుడు సైబరాబాద్‌‌లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు
  • మాదాపూర్‌‌‌‌, జూబ్లీహిల్స్‌‌, బోయిన్‌‌పల్లిలో ఈడీ రెయిడ్లు

హైదరాబాద్‌‌, వెలుగు: సురానా గ్రూప్‌‌  ఆఫ్‌‌  కంపెనీల్లో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌  డైరెక్టరేట్‌‌ (ఈడీ) బుధవారం సోదాలు నిర్వహించింది. సురానా అనుబంధ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్‌‌, భాగ్యనగర్ ప్రాపర్టీస్‌‌పైనా ఏకకాలంలో తనిఖీలు చేసింది. మాదాపూర్‌‌‌‌, జూబ్లీహిల్స్, బోయిన్‌‌పల్లిలోని సురానా గ్రూప్  కంపెనీ చైర్మన్  నరేందర్  సురానా, ఎండీ దేవేందర్  సురానా ఇళ్లతో పాటు సాయిసూర్య డెవలపర్స్‌‌  కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగాయి. సాయిసూర్య  డెవలపర్స్‌‌, భాగ్యనగర్  ప్రాపర్టీస్‌‌పై గతేడాది సైబరాబాద్​లో ఎకనామిక్‌‌  అఫెన్సెస్‌‌  వింగ్‌‌ తో పాటు చెన్నై,  బెంగళూరు‌‌లో సురానా గ్రూప్‌‌ ఆఫ్  కంపెనీలపై నమోదైన సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్‌‌  కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.

 కంపెనీల చైర్మన్‌‌, ఎండీలు సహా కార్పొరేట్‌‌  ఆఫీసుల్లో పలు హార్డ్‌‌డిస్కులు, ల్యాప్‌‌టాప్‌‌లను స్వాధీనం చేసుకుంది. రియల్  ఎస్టేట్‌‌ ప్రాజెక్టుల పేరుతో వసూలు చేసిన  డబ్బును ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించింది. వట్టినాగులపల్లిలో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సాయిసూర్య డెవలపర్స్‌‌, భాగ్యనగర్  ప్రాపర్టీస్‌‌  ప్రచారం చేశాయి. సాయితులసీ ఎన్‌‌క్లేవ్‌‌, షణ్ముక నివాస్‌‌  పేరుతో ప్లాట్ల విక్రయాలను ప్రారంభించాయి. ఒక్కో ప్లాట్‌‌కు రూ.3.25 కోట్ల చొప్పున కస్టమర్లతో అగ్రిమెంట్లు చేసుకున్నాయి. అడ్వాన్స్‌‌గా రూ.1.45 కోట్లు  వసూలు చేశాయి. అయితే, ప్లాట్లను రిజిస్ట్రేషన్  చేయకపోవడంతో బాధితులు నిరుడు నవంబరు‌‌లో సైబరాబాద్  ఈవోడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు.