
- నేడు ఈడీ విచారణకు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కీమ్ స్కామ్ కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రూ.700 కోట్ల మేర ప్రభుత్వ నిధులు పక్కదారిపట్టాయనే ఏసీబీ ప్రాథమిక నివేదిక మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బుధవారం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను విచారించనుంది. గొర్రెల పంపిణీ విధివిధానాలతో పాటు ప్రభుత్వ నిధుల చెల్లింపునకు సంబంధించిన వివరాలను సేకరించనుంది.
గచ్చిబౌలి పోలీసులు, ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా గతేడాది జూన్‌లో ఈడీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్)ను రిజిస్టర్ చేసింది. ఇప్పటికే పలువురు పశుసంవర్ధక శాఖ అధికారులను విచారించింది. ఏసీబీ నివేదికల ఆధారంగా రూ.700 కోట్లు నిధులు ఎలా దారిమళ్లించారనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. 2023 డిసెంబర్‌లో గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మాజీ ఎండీ రాంచందర్‌నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కల్యాణ్ కుమార్ సహా పలువురు పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్, ప్రయివేట్ ఉద్యోగులను ఏసీబీ అరెస్ట్ చేసింది. కీలక నిందితులైన కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్ దుబాయ్‌కి పారిపోయారు. వీరిపై లుక్ అవుట్ సర్క్యులర్లు జారీ అయ్యాయి.