వర్ధన్నపేటలో .. ఒకటే స్కూలు.. రెండు పేర్లు

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఓ ప్రైవేటు పాఠశాల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఒకటే స్కూల్ ను రెండు పేర్లతో నడపడాన్ని సీరియ స్ గా తీసుకున్న విద్యాశాఖ అధికారులు, స్కూల్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గతంలో అరబిందో పేరుతో స్కూలు నడిచేది. ఇటీవల ఆ పాఠశాలను శ్రీచైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం తీసుకుంది.

అయినా, స్కూల్ బోర్డు నుంచి ఫీజు రిసిప్టుల వరకు ప్రతీ దాంట్లో అరబిందో, శ్రీచైతన్య పేర్లు, టెక్నో లాంటి పదాలు వాడడం నిబంధనలకు విరుద్ధం. ఐనా స్కూల్ యాజమాన్యం అవేమీ పట్టించుకోవడం లేదు. పైగా యాప్ పేరుతో ఒక్కో పేరెంట్ నుంచి రూ.3 వేలకు పైగా వసూలు చేశారని తల్లిదండ్రులు స్కూల్ కు వచ్చి యాజమాన్యంతో గొడవ పెట్టుకున్నారు. సోమవారం వర్ధన్నపేట ఎంఈవో రంగయ్య, స్కూల్ కు వచ్చి బోర్డును తొలగించడంతో పాటు నోటీసులు ఇచ్చారు. టెక్నో పదాన్ని తొలగించారు. పాఠ్యపుస్తకాల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.