జ్ఞానం, నైపుణ్యంతో సమాజ సేవ చేయాలి

  • నల్సార్ వర్సిటీ ఆఫ్ లా వీసీ ప్రొఫెసర్ శ్రీక్రిష్ణ దేవరావ్
  • విజ్ఞాన్స్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరు

హైదరాబాద్, వెలుగు: ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం.. విద్య అని నల్సార్ వర్సిటీ ఆఫ్ లా వీసీ ప్రొఫెసర్ శ్రీక్రిష్ణ దేవ రావ్ అన్నారు. విద్య అనేది ఒక చిన్న లక్ష్యంతో మొదలై.. జ్ఞానం, సామర్థ్యాలు వంటి పెద్ద వృక్షం గా పెరుగుతుందని తెలిపారు. జ్ఞానం, నైపుణ్యంతో సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. 

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఆన్​లైన్ లెర్నింగ్, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్​లో ఎంసీఏ, ఎంబీఏ పూర్తి చేసిన స్టూడెంట్లకు 2వ స్నాతకోత్సవాన్ని శనివారం వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి శ్రీక్రిష్ణ దేవరావ్ చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ‘‘ప్రతి ఒక్కరూ తాము చేసే పనిలో నైతిక ప్రమాణాలు పాటించాలి. జ్ఞానం అనేది అందరినీ గొప్ప వ్యక్తిగా మారుస్తది. చదువుపరంగా పొందిన డిగ్రీలు కేవలం మైలురాయి మాత్రమే. కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు ప్రతి ఒక్కరిలో ఆసక్తి, ప్రేరణ ఉండాలి’’అని స్టూడెంట్లకు శ్రీక్రిష్ణ దేవరావ్ సూచించారు. 

స్కూల్స్, కాలేజీలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేదని విజ్ఞాన్స్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ అన్నారు. డిస్టెన్స్, ఆన్​లైన్ ద్వారా కూడా ఉన్నత విద్యనభ్యసించవచ్చని తెలిపారు. అనంతరం 800 మంది స్టూడెంట్లకు డిగ్రీలు అందజేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ లావు దత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, నల్సార్ వర్సిటీ రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్​ పాల్గొన్నారు.