
- అధికారులకు విద్యాశాఖ సెక్రెటరీ యోగితా రాణా ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ల్యాబ్‌లను వేసవి సెలవుల్లోనూ తెరిచే ఉంచాలని అధికారులను విద్యాశాఖ సెక్రెటరీ యోగితా రాణా ఆదేశించారు. ప్రతి రోజూ ఒక గంట ల్యాబ్ చేసుకునే అవకాశం పిల్లలకు కల్పించాలన్నారు. మేలో సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహించాలని, దీని కోసం ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను కలెక్టర్ల ద్వారా పంపించాలని సూచించారు.
సోమవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో కలిసి డీఈవోలు, డీఐఈఓలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. సర్కారు విద్యాసంస్థల్లో ఎన్‌రోల్‌మెంట్ పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్ల పెంపునకు మహిళా సంఘాల సహకారం తీసుకోవాలని సూచించారు. టెన్త్ పాసైన విద్యార్థులను తప్పనిసరిగా ఇంటర్మీడియెట్, ఆ స్థాయి కోర్సుల్లో చేర్పించాలని సూచించారు. ఫెయిలైన విద్యార్థులను ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పరీక్షలు రాయించాలని ఆదేశించారు. దివ్యాంగ, మానసిక వైకల్యం కలిగిన వారిని భవిత కేంద్రాల్లో చేర్పించాలని సూచించారు.