జోరుగా ఇంటి పర్మిషన్ల దందా!

జోరుగా ఇంటి పర్మిషన్ల దందా!
  • ఆ గ్రామాల్లో అప్పుడు కార్పొరేషన్​ పేరిట.. ఇప్పుడు మున్సిపాల్టీ పేరుతో వసూళ్లు
  • 12 గ్రామాలతో కొత్తగా ఏదులాపురం మున్సిపాలిటీ 
  • పంచాయతీ రికార్డులు అప్పగించడంలో ఆలస్యం 
  • పాత తేదీలతో ఇండ్ల పర్మిషన్లు, ఇంటి నెంబర్లు 
  • రూ.10 వేల నుంచి రూ.50వేల వరకు వసూళ్లు

ఖమ్మం/ ఖమ్మం రూరల్, వెలుగు :  ఖమ్మం రూరల్ మండలం నుంచి విడిపోయి కొత్తగా ఏదులాపురం మున్సిపాలిటీ గా ఏర్పాటును  12 గ్రామాల పంచాయతీ సెక్రటరీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని, ఇష్టానుసారం అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. పాత తేదీలతో ఇంటి పర్మిషన్లు, కొత్త ఇంటి నెంబర్లు కేటాయిస్తూ వసూళ్ల దందాకు తెరలేపుతున్నారు. గతంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​ లో ఈ గ్రామాల విలీనం సమయంలోనూ ఇదే తరహాలో దందాలకు పాల్పడ్డారు. ఆ తర్వాత నాలుగేళ్ల కింద స్థానికుల అభ్యంతరాలు, ఆందోళనలతో ఖమ్మం కార్పొరేషన్ నుంచి ఏడు గ్రామాలను విడదీసి పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటికి మరికొన్ని గ్రామాలను కలిపి కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయడంతో మళ్లీ అక్రమాలకు తెరలేపారు. 

లొసుగును ఆసరాగా చేసుకుని... 

ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం, పెద్దతండా, గుర్రాలపాడు, వెంకటగిరి, గుదిమళ్ల, మద్దులపల్లి, తెల్దారుపల్లి, గొల్లగూడెం, బారుగూడెం, ముత్తగూడెం, పొలేపల్లి పంచాయతీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప, పల్లెగూడెం పరిధిలోని రెడ్డిపల్లిని కలుపుతూ ఇటీవల ప్రభుత్వం ఏదులాపురం పేరుతో కొత్తగా మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు సుడా పరిధిలో ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీలుగా ఉన్న ఈ గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. 

ఖమ్మం నగరానికి అనుకుని ఉండటం, పలు కాలనీలు కొత్తగా ఏర్పాటు కావడంతో ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ప్రజలు, రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవించే వారు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. బీపీఎల్ కోటాలో ప్రభుత్వం సత్యనారాయణపురం, వెంకటగిరి, గుర్రాలపాడు, మద్దులపల్లి, పోలేపల్లి, రాజీవ్  గృహకల్ప, కరుణగిరి ప్రాంతాల్లో  పేదలకు ప్లాట్లు పంపిణీ  చేసింది. 

ఒరిజినల్ గా ప్లాటు వచ్చిన లబ్ధిదారులు కొందరు వీటిని ఇప్పటికే అమ్ముకోగా చాలా ప్లాట్లు పలుమార్లు చేతులు మారాయి. ఆ ప్లాట్లలో ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంటి నెంబర్లు రావాలన్నా పంచాయతీ సెక్రటరీల పర్మిషన్లు తప్పనిసరి. ఈ లొసుగును ఆసరాగా చేసుకుని విలీన గ్రామాల్లో చోటామోటా నాయకులు, పంచాయతీ సెక్రటరీలు ఇంటి పర్మిషన్లు, ఇంటి నెంబర్లు ఇప్పిస్తామని వసూళ్లకు పాల్పడుతున్నారు. 

రూ.10 వేల నుంచి 40 వేల వరకు.. 

కొత్త మున్సిపాలిటీ ఏర్పాటును ప్రకటించినప్పటి నుంచి ఈ దందా కొనసాగుతున్నాయి. మూడు రోజుల కింద ఏదులాపురం మున్సిపల్ ఇన్​చార్జ్ కమిషనర్ గా అహ్మద్ షపీ ఉల్లా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతానికి ఏదులాపురం పంచాయతీ కార్యాలయాన్నే తాత్కాలిక మున్సిపల్ ఆఫీసుగా మార్చి, ఆ గ్రామ పంచాయతీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వారంలో మిగిలిన గ్రామాల రికార్డులు కూడా స్వాధీనం చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో 12 గ్రామాల సెక్రటరీలు ఇంటి పర్మిషన్లు, ఖాళీ స్థలాలకు ధ్రువ, అనుమతి పత్రాలు ముందు తేదీలతో రాసిస్తున్నారు.

 వీటితో ఆ ఇండ్లను రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇంటి నెంబర్ కేటాయించడానికి రూ.10 వేలు, ఏళ్లుగా ఉంటున్న ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ధ్రువపత్రం రాస్తే రూ.40 వేలు డిమాండ్ చేసి తీసుకుంటున్నట్లు తెలిసింది. వీటిపై అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

ALSO READ : పాలమూరు పంపులకు పవర్​ కట్.​!కరెంట్ సరఫరా నిలిపేసిన ట్రాన్స్​కో

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు 

ఏదులాపురం మున్సిపాలిటీ గెజిట్ వచ్చినప్పటి నుంచి ఆయా గ్రామాల్లో రికార్డులన్నీ మున్సిపాలిటీకి మారినట్టే. ఐదు జీపీల రికార్డులను మున్సిపల్ అధికారులకు అప్పగించాం. మిగతా గ్రామాల రికార్డులను కూడా అప్పగిస్తాం. పాత తేదీలతో సెక్రటరీలు పర్మిషన్లు ఇస్తున్న విషయం తెలియదు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.   -‌‌‌‌ ఎస్​.కుమార్, ఖమ్మం రూరల్ ​ఎంపీడీవో

ఖమ్మం రూరల్​ మండలం మద్దులపల్లిలో ఓ వృద్దురాలికి ఎకరం అసైన్డ్​మెంట్​ పట్టా భూమి ఉంది. అందులో ఇల్లు నిర్మించుకునేందుకు గతంలో పర్మిషన్ అడిగితే అప్పటి సెక్రటరీ ఇవ్వలేదు. నాలుగేళ్ల కింద ఆ భూమిలో ఆమె ఇల్లు కట్టుకుంది. ఇంటికి పర్మిషన్ లేకపోవడంతో కరెంట్ మీటర్ ఇవ్వలేదు. 

దీంతో కాయకష్టం చేసి కట్టుకున్న ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు మున్సిపాలిటీగా మారుతుండడంతో ప్రస్తుతం ఉన్న కార్యదర్శిని ఇంటి నంబర్​ కోసం అడిగితే రూ.40 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. అదే గ్రామంలో మరో వ్యక్తి ఇంటి పర్మిషన్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన దగ్గర నుంచి రూ. 50 వేలు తీసుకొని బ్లూప్రింట్, పాత డేట్ తో ఇంటి పర్మిషన్​ ఇచ్చినట్టు సమాచారం. ఏదులాపురం మున్సిపాలిటీగా ఏర్పడుతున్న 12 గ్రామాల్లో ఇలాంటి సంఘనలు ఎన్నో ఉన్నాయి.