ప్రాణాలు పోతున్నా..ఎలక్షన్లే ముఖ్యమా?

రాష్ట్రంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. పాజిటివ్​ కేసుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. కేసులే కాదు.. మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ కూడా కరోనా వైరస్​ బారినపడ్డారు. ఎన్నో జాగ్రత్తలతో ఉన్న మీకే కరోనా వచ్చింది. అంటే దాని తీవ్రతను అర్థం చేసుకోండి. ఇక రాష్ట్రంలోని సామాన్యుల పరిస్థితి ఏమిటి? కరోనా పేషెంట్ల రక్షణ కోసం వందల కోట్లు కాదు వేల కోట్లు ఖర్చు చేసినా తక్కువే. ప్రస్తుతం ఆరోగ్యమే అందరికీ ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకదాని తర్వాత మరొకటిగా ఎన్నికలు నిర్వహించడం ఎంత వరకు శ్రేయస్కరం. ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఆలోచిస్తే మున్సిపల్​ ఎన్నికలను వాయిదా వేయాలి.

మనదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడు సెకండ్​ స్టేజ్​లో ఉంది. గతంలో కరోనా బారిన పడితే తుమ్ములు, దగ్గు, జ్వరం ఇలాంటి లక్షణాలు కనిపించేవి. కోలుకోవడానికి 14 రోజుల టైం పట్టేది. 60 ఏండ్లు దాటిన వారిపై ఎక్కువగానూ, 25 ఏండ్లలోపు వారిపై తక్కువగానూ ప్రభావాన్ని చూపేది. గతంలో ఉన్న వైరస్ వేరు. ఇప్పుడు సెకండ్​ వేవ్​లో అది మారిన తీరు.. దాని వేగం వేరు. మహమ్మారి సోకిన మూడు రోజుల్లోనే తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏ మాత్రం లక్షణాలు కనబడకుండా, వయసుతో సంబంధం లేకుండా 30 ఏండ్ల వారినైనా మూడు రోజుల్లోనే మృత్యువు దగ్గరకు చేరుస్తోంది. కరోనా చాలా డేంజరస్​ స్టేజ్ లో ఉందని వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్​ కూడా వెల్లడించింది. ఎందుకంటే.. కరోనా అని తెలుసుకునేలోపే ట్రీట్​మెంట్​ చేసినా.. బతకలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యాన్ని, ఓవర్ కాన్ఫిడెన్స్ ను పక్కన పెట్టి ముందు జాగ్రత్తలు పాటించాలి.
 

ఎన్నికలు వాయిదా వేయలేరా?
ఇటీవలే నాగార్జునసాగర్​ ఉప ఎన్నిక పూర్తయ్యింది. కరోనా విజృంభిస్తున్న టైంలో లక్ష మందితో టీఆర్ఎస్​ పార్టీ మీటింగ్​ పెట్టింది. ఆ మీటింగ్ వల్ల ఎన్ని వేల మందికి కరోనా అంటిందో? ఆ పాపం ఎవరిది? ఇప్పుడు 2 మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీల్లో ఎన్నికల హంగామా కొనసాగుతోంది. కరోనా వేగంగా విస్తరిస్తున్న టైంలో ప్రచారాలు, రోడ్​ షోలు, సభలు, సమావేశాలు నిర్వహించడం వల్ల వేల మందికి కరోనా సోకే అవకాశం ఉంది. వైన్​షాపులు, బార్లు, హోటల్స్ లాంటివి విచ్చలవిడిగా నడుస్తున్నాయి. వాటిని బందు పెట్టడంలేదు. ప్రజలు కరోనా బారిన పడక ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. మొసలి కన్నీరు కారుస్తూనే ఒకటి తర్వాత ఒకటిగా ఎన్నికలు నిర్వహిస్తోంది. మీరు ప్రజలను పాలించాలంటే ముందు వారంతా ప్రాణాలతో ఉండాలి కదా? కరోనా పెరుగుతోందని స్కూళ్లు, కాలేజీలు బంద్ చేశారు. టెన్త్, ఇంటర్​ ఫస్ట్​ ఇయర్​ పరీక్షలు రద్దు చేశారు, ఇంటర్ సెకండ్​ ఇయర్​ పరీక్షలను వాయిదా వేశారు. పలు దేవాలయాల్లో దర్శనాలు రద్దు చేశారు. మరి ఎన్నికలను వాయిదా వేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదు.

విచిత్రంగా సర్కారు తీరు
నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా చూడాల్సిన సమయంలో తెలంగాణ సర్కారు తీరు విచిత్రంగా ఉంది. కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం లేదు. పరీక్ష కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. టీకాల కోసం మెజారిటీ ప్రజలు ప్రైవేటునే ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్​ ఎన్నికలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం. ప్రజల ప్రాణాల కంటే ఈ ఎన్నికలే ముఖ్యమా? ప్రజలు ఆరోగ్యంగా లేనప్పుడు గెలిచిన పదవులతో ఎవరికి సేవలు చేస్తారు? పదవులు లేకుంటే బతకలేరా? ఇంత కష్టకాలంలో గెలిచి.. పదవి పొంది ప్రజల సొమ్ముతో బతకాలా? ప్రజలు ఎవరైనా ఎన్నికలు పెట్టాలని అడిగారా? కొంతమంది రాజకీయ నిరుద్యోగుల కోసం ప్రజలను, ప్రభుత్వ అధికారులను ఇబ్బంది పెట్టడం అవసరమా? వారు లేకుంటే ప్రజాపాలన సజావుగా సాగదా? ప్రజల సొమ్ము దోచుకోవడం లేటు అవుతుందా? 

పేదలను ఆదుకునేది ఎవరు?
ఎన్నికల్లో నిలబడిన నాయకులు ఎంతో కొంత ఆర్థిక స్తోమత ఉన్న వారే. వారికి వైరస్​ సోకినా ట్రీట్​మెంట్​ తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు. కానీ వారి వెంట తిరిగే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? రోజువారీ కూలీలు, పొట్ట చేత పట్టుకుని బతికేటోళ్లు రోజూ మీరు ఇచ్చే డబ్బులకు ఆశపడి వెంట వస్తారు. వారికి కరోనా వైరస్ సోకితే పరిస్థితి ఏమిటి? ఆరోగ్యశ్రీలో ట్రీట్​మెంట్​ చేయరు. ఫ్రీగా ఎవరూ చూడరు. నమ్ముకున్న లీడర్ వారిని ఆదుకోడు. ఇక వారికి ఎవరు దిక్కు? పరోక్షంగా ప్రజలను చంపడానికేనా ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించేది? రాష్ట్ర ఎన్నికల సంఘానికి కరోనా వైరస్​ విస్తరిస్తున్న విషయం తెలియదా? లేక ప్రభుత్వ ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకుందా? ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్​ ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేయాలి. ఇప్పుడు ఈ మున్సిపల్​ ఎన్నికలను వాయిదా వేస్తే జనాలకు ఎలాంటి నష్టం జరగదు.

మంత్రులు, ప్రజాప్రతినిధులతో పర్యవేక్షించాలె
ఆరోగ్యశ్రీలో కరోనా ట్రీట్​మెంట్​ను చేర్చలేదు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్​ భారత్​ను రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పి చేయడం లేదు. పేద ప్రజల ప్రాణాలు మీకు ముఖ్యం కాదా? వాళ్ల ఓట్లతో మీరు గెలవలేదా? ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ మీకు కనపడట్లేదా? మూడు నుంచి ముప్పై లక్షలకు పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ వసూలు చేస్తున్నాయి. దీంతో కరోనా వైరస్​ సోకితే ఉన్నవన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఆర్థిక స్తోమత లేని పేదలు ట్రీట్​మెంట్​ తీసుకునే దారి లేక ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే కదా రాష్ట్రంలో ఏ కార్యక్రమం అయినా చేపట్టేది. అందువల్ల నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారానికి పంపినట్లుగా ప్రతి హాస్పిటల్ కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పంపి కరోనా ట్రీట్​మెంట్​ను పర్యవేక్షించండి. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ జీతాలను కరోనా పేషెంట్ల కోసం ఖర్చు చేయండి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ తీసుకోలేనంతగా మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జీతాలు తీసుకుంటున్నారు. అది ప్రజల సొమ్ము కాదా? ఇంత కష్టకాలంలో వాటిని ప్రజల కోసం ఖర్చు చేయలేరా?
- శ్రీనివాస్ తిపిరిశెట్టి, సీనియర్ జర్నలిస్ట్