
- కాలువల పూడికతీత పనులు చేయిస్తే మేలు
- గతేడాది పూర్తి కాని పని దినాలు
- ఈ ఏడాది రీచ్ అయ్యేలా అధికారుల ప్రయత్నాలు
గద్వాల, వెలుగు: ఉపాధి హామీ పథకంలో పని చేసిన కూలీలకు రేటు గిట్టుబాటు కావడం లేదు. గతేడాది కూలీలకు రోజూ సగటున రూ. 197.50 మాత్రమే వచ్చాయి. ఒక్కో రోజుకు రూ. 280 నుంచి రూ. 300 వరకు కూలీ ఇవ్వాలి. ఇలా రాకపోవడంతో చాలామంది ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. సరైన అవగాహన లేకపోవడంతోనే గిట్టుబాటు కూలీ రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపాధి హామీలో చేసిన పనికి కొలతల ఆధారంగా కూలీ చెల్లిస్తారు. ఎక్కువ కూలీ వచ్చే పనులను చేయించడంలో ఆఫీసర్లు విఫలమవుతున్నారు. ఈ ఏడాది ఉపాధి హామీ పనుల కింద 23, 84,972 పని దినాలు కల్పించాలని టార్గెట్ పెట్టుకున్నారు.
గతేడాది 23. 2 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా 21. 41 లక్షల పని దినాలు మాత్రమే కల్పించారు. 62 వేల కుటుంబాలలో లక్షా ఆరు వేల మందికి పని కల్పించారు. వీరిలో ఒక్కొక్కరికి యావరేజ్ గా రోజుకు రూ. 197. 50 చెల్లించారు.మార్చి, ఏప్రిల్, మే నెలలో కూలీల సంఖ్య గణనీయంగా పెరగాలి. మార్చి నెలలో ఆశించిన స్థాయిలో కూలీల సంఖ్య పెరగకపోవడంతో ఈ ఏడాది కూడా టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
జోగులాంబ గద్వాల జిల్లాలో 1.57 లక్షల జాబ్ కార్డ్స్ ఉన్నాయి. ఈ జాబ్ కార్డ్స్ లో 3.35 లక్షల మంది కూలీలు ఉన్నారు. 1.57 లక్షల జాబ్ కార్డ్స్ ఉన్నప్పటికీ కేవలం 88 వేల జాబ్ కార్డ్స్ మాత్రమే యాక్టివ్‌లో ఉన్నాయి. 3. 35 లక్షల మంది కూలీల్లో 1. 60 లక్షల మంది మాత్రమే కూలీకి వస్తున్నారు. సగానికి పైగా కూలీలు జాబ్ కార్డ్స్ ఉన్నప్పటికీ పనికి వెళ్లడం లేదు. వారు రాకపోవటం వల్లే ఉపాధి హామీ పనుల టార్గెట్ రీచ్ కాలేదని తెలుస్తోంది.
గిట్టుబాటు పనులు చేయించాలి
ప్రస్తుతం ఉపాధి హామీ లో చెట్ల కటింగ్, పొలాల్లో రాళ్ల ఏరివేత, ల్యాండ్ లెవలింగ్, హరితహారం నర్సరీల పెంపకం తదితర పనులు చేస్తున్నారు. చెట్ల కటింగ్, రాళ్ల ఏరివేత పనులు చేస్తే కూలీగిట్టుబాటు కావడం లేదు. కాలువల పూడికతీత, షీల్ట్ తొలగింపు పనులు చేయిస్తే గిట్టుబాటు కూలీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో నెట్టెంపాడు కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాటి పూడికతీత పనులు చేస్తే అటు రైతులకు ఇటు కూలీలకు మేలు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా కాలువల పూడికతీత పనులు చేయించడం వల్ల కొలతలు సరిగా వచ్చి కూలీ పెరుగుతుంది.
పనులు వేగంగా జరుగుతున్నాయి
ఉపాధి హామీ పథకం కింద పనులు గ్రామాల్లో వేగంగా జరుగుతున్నాయి. తప్పకుండా టార్గెట్ రీచ్ అవుతాం. ఈ నెలలో గణనీయంగా కూలీల సంఖ్య పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ రీచ్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నాం. నర్సింగరావు డీఆర్డీఏ, పీడీ గద్వాల