
- ఎండోమెంట్ ట్రిబ్యునల్ సంచలన నిర్ణయం
- తక్షణమే ఈవోను నియమించాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలోని చార్మినార్ భాగ్యలక్ష్మీ టెంపుల్ నిర్వహణను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొస్తూ ఎండో మెంట్ ట్రిబ్యునల్ బుధవారం సంచలన నిర్ణ యం ప్రకటించింది. ఈ మేరకు 110 పేజీల తీర్పు వెలువరించింది. మహంత్ మనోహర్ దాసు, మహంత్ రాంచంద్ర దాసు 1960 నుంచి భాగ్యలక్ష్మీ టెంపుల్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఇక నుంచి ఆలయాన్ని ఎండోమెంట్ శాఖ పరిధిలోకి తీసుకొస్తూ ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకున్నది. తక్షణమే టెంపుల్ కు ఈవోను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, చార్మినార్ అమ్మవారి టెంపుల్ పరిధిలో 1960లో బస్సు ప్రమాదం జరిగింది. ఆ టైంలో అమ్మవారి విగ్రహం డ్యామేజ్ కాగా.. స్థానిక భక్తులు డొనేషన్లు వేసుకొని అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు.
ఈ విగ్రహం ప్రతిష్టించిన తర్వాత అమ్మవారిని పోచమ్మగా కాకుండా భాగ్యలక్ష్మీగా పిలుచుకుంటున్నారు. అప్పటి నుంచి భాగ్యలక్ష్మీ టెంపుల్‌గా పేరుగాంచింది. కాగా, రాంచంద్ర దాసు శిష్యుడు రాజ్ మోహన్ దాస్ అనే వ్యక్తి కూడా హెరిడిటరీ ట్రస్టు ద్వారా ఈ టెంపుల్‌పై అజామాయిషీ చలాయిస్తున్నాడు. అయితే, మహంత్ రాంచంద్ర దాసు కూతురుగా చెప్పుకుంటున్న మహిళ భాగ్యలక్ష్మీ టెంపుల్‌పై అజామాయిషీ చలాయిస్తున్న వారిపై కోర్టుకు ఎక్కారు.
దీంతో ఆమెకు, రాజ్ మోహన్ దాసుకు మధ్య వివాదం నడుస్తున్నది. కాగా, ఈ టెంపుల్‌కు ఏడాదికి దాదాపు రూ.12 కోట్లు ఆదాయం వస్తుండగా.. యూపీ నుంచి వచ్చిన రాజ్ మోహన్ దాసు టెంపుల్‌పై అజామాయిషీ చలాయిస్తున్నాడు. ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్స్ పే చేయడం లేదు. టెంపుల్ నుంచి వచ్చిన ఆదాయాన్ని కోర్టు కేసుల కోసం వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ టెంపుల్‌ను దేవాదాయశాఖకు అప్పగించాలని ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. తక్షణమే ఈవోను నియమించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. టెంపుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.