- బాడీ డ్రెంచ్ ఇండియా, సర స్పోర్ట్స్, ఎక్సలెంట్ ఎంటర్‌ప్రైజెస్‌కు నోటీసులు
- ఈ నెల 22, 24, 25 తేదీల్లో విచారణకు రావాలని ఆదేశం
- మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ స్టేట్‌మెంట్ ఆధారంగా విచారణ
హైదరాబాద్, వెలుగు: ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్‌మాల్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు స్పీడప్ చేసింది. జనరేటర్లు, జిమ్ పరికరాలు, క్రికెట్ బాల్స్, అగ్నిమాపక పరికరాలు సహా ఇతర సామగ్రి కొనుగోళ్లకు సంబంధించి మూడు కంపెనీలకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌ను ఈ నెల 8న విచారించిన సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా బాడీ డ్రెంచ్ ఇండియా, సర స్పోర్ట్స్, ఎక్సలెంట్ ఎంటర్‌ప్రైజెస్ కాంట్రాక్ట్ కంపెనీలకు ఈడీ సమన్లు ఇచ్చింది. ఈ నెల 22 నుంచి 25 వరకు ఆయా సంస్థల ప్రతినిధులు క్రికెట్ స్టేడియం టెండర్స్, బిడ్స్, బిల్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లతో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
3 కంపెనీల నుంచి నిధులు దారి మళ్లింపు..
ఎక్సలెంట్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ బకెట్ సీట్స్ సప్లయింగ్‌లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కంపెనీ ద్వారా రూ.43.1 లక్షలు హెచ్‌సీఏ నిధులు దారి మళ్లినట్లు ఈడీ గుర్తించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలతో ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
టెస్ట్ క్రికెట్ కోసం ఎస్‌జీ బాల్స్ సప్లయ్ చేసిన సర స్పోర్ట్స్ కంపెనీ ద్వారా హెచ్‌సీఏకు రూ.57 లక్షలు నష్టం వాటిల్లినట్లు ఈడీ గుర్తించింది. వీటికి సంబంధించిన బిల్స్, ఇన్‌వాయిస్‌లు తదితర డాక్యుమెంట్లతో ఈ నెల 24న విచారణ హాజరుకావాలని పేర్కొంది. బాడీ డ్రెంచ్ ఇండియా రూ.1.5 కోట్లు విలువ చేసే జిమ్ ఎక్విప్‌మెంట్‌ను హెచ్‌సీఏకి సప్లయ్ చేసింది. ఇందుకు సంబంధించి ఆధారాలతో ఈ నెల 25న హాజరుకావాలని దర్యాప్తు సంస్థ సూచించింది.
కాగా, 2020 మార్చి నుంచి 2023 ఫిబ్రవరి మధ్య కాలంలో హెచ్‌సీఏ ఆర్థిక లావాదేవీల వివరాలను ఈడీ సేకరించింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌తో పాటు ఏసీబీ, ఈడీ సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, ఆడిట్ రిపోర్ట్ వివరాలతో ఇప్పటికే అజారుద్దీన్‌ను ప్రశ్నించింది. జనరేటర్లు, జిమ్ పరికరాలు, క్రికెట్ బాల్స్, అగ్నిమాపక పరికరాలు సహా ఇతర సామగ్రి కొనుగోలుకు సంబంధించిన టెండర్స్, బిడ్స్, బిల్స్, ఇన్‌వాయిస్‌ల రికార్డుల ఆధారంగా పరికరాలకు కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.20 కోట్లు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. దర్యాప్తులో భాగంగా ఈ మూడు కంపెనీల ప్రతినిధులను ఈడీ ప్రశ్నిస్తున్నది.