ENG v WI 2024: టెస్టుల్లో టీ20 విధ్వంసం.. వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డ్

ENG v WI 2024: టెస్టుల్లో టీ20 విధ్వంసం.. వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డ్

టెస్టుల్లో ఇంగ్లాండ్ దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రత్యర్థి ఎవరైనా.. గడ్డ ఎక్కడైనా బజ్ బాల్ ఆటతీరుతో ఫ్యాన్స్ ను ఉర్రుతలూగిస్తున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ పై సొంతగడ్డపై జరుగుతున్న టెస్టులోనూ ఇంగ్లాండ్ ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. టెస్టుల్లో టీ 20 బ్యాటింగ్ చూపిస్తూ సరికొత్త వినోదాన్ని పంచుతుంది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా గురువారం (జూలై 18) వెస్టిండీస్ తో ప్రారంభమైన రెండో టెస్టులో కేవలం 26 బంతుల్లోనే 50 పరుగులను పూర్తి చేసుకుంది.

ఓపెనర్ బెన్ డకెట్ చెలరేగడంతో ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ లో అతి తక్కువ బంతుల్లోనే 50 పరుగుల మార్క్ అందుకున్న జట్టుగా ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఇంగ్లాండ్ కేవలం 4.2 ఓవర్లలోనే 50 పరుగులను బాదేసింది. ఇప్పటివరకు ఈ రికార్డ్ ఇంగ్లాండ్ పేరిట ఉండడం విశేషం. 1994 లో సౌతాఫ్రికాపై ఇంగ్లాండ్ 4.3 ఓవర్లలో 50 పరుగులు చేసింది. తాజాగా వెస్టిండీస్ పై చెలరేగడంతో తమ రికార్డ్ తామే బద్దలు కొట్టుకున్నారు. 

తొలి ఓవర్లో ఇంగ్లాండ్ నాలుగు పరుగులు చేసి క్రాలి వికెట్ ను కోల్పోయింది. అయితే జయదేవ్ సీల్స్ వేసిన రెండో ఓవర్ లో డకెట్ నాలుగు ఫోర్లు కొట్టడంతో 19 పరుగులు వచ్చాయి. మూడో ఓవర్లో 12.. నాలుగో ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. ఐదో ఓవర్ తొలి రెండు బంతులకు 6 పరుగులు రావడంతో ఇంగ్లాండ్ 4.2 ఓవర్లో 50 పరుగులు పూర్తి చేసి వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్  డకెట్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం విశేషం. డకెట్ జోరుతో ఇంగ్లాండ్ ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజ్ లో పోప్ (45) రూట్ (7) ఉన్నారు. 71 పరుగులు చేసి డకెట్ ఔటయ్యాడు.