సమసమాజం ఎలా సాధ్యం?

సమసమాజం ఎలా సాధ్యం?

 ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక్కొక్క రంగం అభివృద్ధిపై  విస్తృత ప్రణాళిక అవసరం. ఆ రంగానికి  సంబంధించిన మేధావులతో  కమిషన్ ఏర్పాటు చేయాలి.  కమిషన్ సమర్పించిన  నివేదిక ప్రకారం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసినట్లు అయితే రాష్ట్రం ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి సాధిస్తుంది.  విద్యారంగం,  వైద్యరంగం,  వ్యవసాయం,  నీటిపారుదల,  విద్యుత్తు,  రవాణా సంక్షేమం మొదలు వివిధరకాల  కీలకరంగాలు చాలా ఉన్నాయి. నేను 33 సంవత్సరాలు  విద్యారంగంలో పనిచేశాను. 

 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తోందనే మాట తరచుగా వినపడేది.  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయనే దానిలో నిజం లేదు. అయితే,  ప్రస్తుతం రాష్ట్రంలో  భిన్నరకాల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులను ఎన్ని రకాలుగా విడదీయాలో అన్నివిధాలుగా విడగొట్టడం జరుగుతోంది. 

మొత్తం సమాజాన్ని వర్గాలుగా విడదీసి..ఆయా వర్గాల పిల్లలుగా గుర్తించడం జరుగుతోంది.  ప్రతి ఊరికి బడి,  గుడి  రెండు కళ్లులాంటివి.  బడిలో విద్యార్థులు లేకపోతే ఆ బడి మూతపడుతుంది. ఊరు చైతన్యం కోల్పోతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో  చాలా రకాల పాఠశాలలు నడుస్తున్నాయి. ఎంపీపీ పాఠశాలలు, జడ్పీ పాఠశాలలు,  నవోదయ పాఠశాలలు,  కేంద్రీయ విద్యాలయాలు, మోడల్ స్కూల్స్,  కస్తూర్బా పాఠశాలలు, ఎస్సీ గురు కులాలు,  ఎస్టీ గురుకులాలు,  జ్యోతిరావు ఫూలే బీసీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు,  సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ (పాతవి),  ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్,  ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్,  మదర్సాలు,  ప్రైవేటు పాఠశాలలు స్టేట్​సిలబస్,  ఎయిడెడ్​ పాఠశాలలు,  ప్రైవేటు పాఠశాలలు సీబీఎస్​సీ,  ప్రైవేటు పాఠశాల ఐసీఎస్సీ,  సింగరేణి పాఠశాలలు,  రైల్వే పాఠశాలలు,  అంగన్వాడీ పాఠశాలలు, ప్లే స్కూల్స్  ఇలా ఎన్నోరకాల  పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ స్కూల్స్ నిర్వహణ కోసం  విద్యార్థులను వర్గాలవారీగా విడదీయడం జరుగుతోంది. 

కులాలవారీగా పాఠశాలలు?

అధికారంలో ఉన్నవారు తమకు నచ్చిన తీరున పాఠశాలలు ఏర్పాటు చేసుకుంటూపోతే విద్యార్థులు వర్గాలవారీగా,  కులాలవారీగా విడిపోతారు. విద్యార్థుల మనసులో  కులం అనే అభిప్రాయం మెదడులో నాటుకుపోతుంది. దీంతో  సమాజంలోని ఇతర కులాల విద్యార్థులతో  సన్నిహితంగా, సఖ్యతగా ఉండలేరు.  వెనుకబడిన కులాల విద్యార్థులకు న్యూనతాభావం ఏర్పడుతుంది. 

సమాజంలోని విద్యార్థులు కలిసిమెలిసి చదువుకునే ఆకాశం  లేకుండాపోతుంది. ఈ మధ్యకాలంలో మద్రాస్ హైకోర్టు.. ప్రభుత్వం నిర్వహించే పాఠశాలల్లో  కులం పేర్లు పెట్టకూడదని తమిళనాడు ప్రభుత్వానికి  సూచించింది.  ప్రస్తుతం ప్రతి కుటుంబంలో ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్నారు.  ఇప్పటి యువత ఉద్యోగ,  ఉపాధి కోసం పట్టణాలకు వలసపోతున్నారు.  గ్రామీణ ప్రాంతాలలో పిల్లల సంఖ్య తక్కువగా ఉంటుంది. అందులో ఇన్ని రకాల పాఠశాలలు విద్యార్థులు వారి వర్గానికి సంబంధించిన గురుకులాలలో ప్రవేశం తీసుకుంటున్నారు. 
గ్రామీణ ప్రాంతాల్లో..

తగ్గుతున్న విద్యార్థుల శాతం

చాలా ప్రభుత్వ పాఠశాలల్లో  మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించలేకపోతున్నది.  దీంతో  విద్యార్థుల తల్లిదండ్రులను సర్కారు బడులు ఆకర్షించలేకపోతున్నాయి. చివరికి నేను చెప్పదలుచుకున్నది ఏమంటే..  కులాలపరమైన విద్యావ్యవస్థను రద్దు చేసి గ్రామీణ ప్రాంతాల్లో  పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఆధునిక వసతులు, మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి.  పిల్లలు ఇంటి నుంచి ఆ ఊరి పాఠశాలలకు వెళ్లేందుకు  రవాణా ఏర్పాట్లు చేయాలి.  దీంతో  ఆ గ్రామంలోని అందరు పిల్లలు ఒకే పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తారు.

  వారికి సమాజంపట్ల  సమభావన  కలుగుతుంది.   విద్యార్థులు కూడా  తల్లిదండ్రులతోపాటే ఉంటే  తమకోసం పేరెంట్స్​ పడుతున్న కష్టాలు పిల్లలు ప్రత్యక్షంగా చూసే అవకాశం కలుగుతుంది.  పిల్లల్లో మానవత్వం, వృత్తిపట్ల  గౌరవం పెరుగుతుంది.  సమాజంపై  అవగాహన  ఏర్పడుతుంది.  ఈ దిశగా ప్రభుత్వ విధానాలు కొనసాగితే.. సమసమాజ స్థాపన జరిగి విద్యార్థులందరికీ ఒకేవిధంగా  మెరుగైన విద్య అందుతుంది.

- అల్లంమల్లికార్జున్ రావు, స్కూల్​ హెడ్మాస్టర్​ (రిటైర్డ్​)