జనగామ, వెలుగు: కంటి వెలుగు సక్సెస్ కోసం సర్పంచ్లు ప్రతి ఇంటికెళ్లి, జనాల్లో అవగాహన పెంచి కేసీఆర్ ను దేవుడిలా చూపెట్టాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కంటి వెలుగు శిబిరం ఉన్న రోజుల్లో సదరు చోట్ల ఈజీఎస్ పనులు బంద్ పెట్టి, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. జనగామ కలెక్టరేట్లో గురువారం కంటి వెలుగు పథకం అమలుపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు.
అందరూ కలిసికట్టుగా పనిచేసి కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జనగామను నంబర్ వన్ గా నిలపాలని మంత్రి సూచించారు. అందు కోసం ఈనెల 12 లోపు మండలాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలన్నారు. తదుపరి సర్పంచ్లు తమ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించడంతో పాటుగా ప్రతి ఇంటికెళ్లి అవగాహన కల్పించాలన్నారు. కంటి పరీక్షలకు సంబంధించి ఏరోజు, ఏ గ్రామంలో శిబిరం ఉంటుందనే సమాచారాన్ని మందుగానే ప్రచారం చేయాలన్నారు. శిబిరాల వద్ద మౌళిక వసతులను కల్పించాలన్నారు.
ప్రైవేటులో కంటి ఆపరేషన్లకు చర్యలు
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఆపరేషన్లు అవసరమున్న వారికి ప్రైవేట్లో కంటి ఆపరేషన్లు చేయించేందుకు చర్యలు చేపడతామని, మరో నాలుగైదు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుందని మంత్రి దయాకర్ రావు తెలిపారు. ఈ విషయంపై ప్రైవేటు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. జనగామ జిల్లాలో గతంలో 4 లక్షల మందికి కంటి పరీక్షలు చేయగా ఇప్పుడు 6 లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నామన్నారు. జిల్లాకు ఏడువేల రీడింగ్ గ్లాసెస్ వచ్చాయన్నారు.