ఎత్తొండ సొసైటీలో గోల్​మాల్ డీపీవో రిపోర్ట్​లో నిగ్గుతేలిన నిజాలు

  • రూ.8.70 కోట్ల విలువైన సీఎంఆర్​ వడ్లు మాయం
  • ఫర్టిలైజర్​ అమ్మకాల్లో రూ.44.58 లక్షల తేడా
  • రూ.2.12 కోట్ల బిజినెస్​ రికవరీలో అశ్రద్ధ

కోటగిరి/నిజామాబాద్, వెలుగు: రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన నిజామాబాద్​ జిల్లాలోని ఎత్తొండ పీఏసీఎస్​ అవినీతి, అక్రమాల్లో మునిగిపోయింది. ఆరు నెలలుగా నిర్వహించిన విచారణలో తేలిన అక్రమాల వివరాలను డీసీవో శ్రీనివాస్​ పాలకవర్గానికి పంపారు. మాజీ ప్రెసిడెంట్​ అశోక్​పటేల్, సెక్రటరీ సంతోష్ పై క్రిమినల్​ కేసు నమోదు చేయించాలని రిపోర్టులో సూచించారు. ఈ క్రమంలో శుక్రవారం సొసైటీ ఇన్​చార్జి​ప్రెసిడెంట్​ రామదాసు అధ్యక్షతన సంఘ సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ వ్యవహారంపై చర్చించారు. 

డీసీవో రిపోర్టు ప్రకారం..

  సీఎంఆర్​ కింద గవర్నమెంట్​ నుంచి తీసుకున్న రూ.8.70 కోట్ల విలువైన వడ్లు సొసైటీ నుంచి మాయమయ్యాయి. మాజీ ప్రెసిడెంట్​ ఆర్.అశోక్​పటేల్, సెక్రటరీ సీహెచ్.సంతోష్​తో పాటు మేనేజింగ్​ కమిటీ సభ్యులంతా దీనికి బాధ్యులు. 11 శాతం వడ్డీతో రూ.8.70 కోట్ల సొమ్ము వసూలు చేయాలి.

సొసైటీ జనరల్​ బాడీ అప్రూవల్​ లేకుండా రూ.3.82 కోట్లను వివిధ అవసరాల కోసం డైవర్ట్​ చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. పాలక సభ్యుల పర్యవేక్షణ లోపం కారణం.

2019లో 6 వేల మెట్రిక్​ టన్నుల గోదాం నిర్మాణం,  పారా బాయిల్డ్​ రైస్​ మిల్లు కోసం రూ.1.33 కోట్లకు ఆమోదం పొంది, రూ.17.28 లక్షలు అదనంగా ఖర్చు చేయడం చెల్లదు.

సొసైటీలో 13 మంది రెగ్యులర్​ ఎంప్లాయీస్, 8 మంది టెంపరరీ ఉద్యోగుల నియామకంతో ఖర్చు పెరిగింది. వీరి సంఖ్యను తగ్గించి ఖర్చును కంట్రోల్​ చేయాలి.

సొసైటీకి బయటి వ్యక్తులు చెల్లించాల్సిన రూ.2.12 కోట్ల వసూలులో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని, వారందరికీ వెంటనే నోటీసులు పంపాలని సూచించారు.

  ఫర్టిలైజర్​ వ్యాపారంలో రూ.44.58 లక్షల విలువైన స్టాక్​ తేడా ఉంది. దీనికి గల కారణాలు తెలియజేయాలి. 
  2019 నుంచి 2024 వరకు పొంతన లేని లెక్కలు చూపి వాడుకున్న రూ.6.32 లక్షలను మాజీ ప్రెసిడెంట్​ అశోక్​పటేల్, సెక్రటరీ సంతోష్​ నుంచి 11 శాతం వడ్డీతో వసూలు చేయాలి. సరైన కారణాలు లేకుండా ప్రెసిడెంట్​  హోదాలో అశోక్​పటేల్​ డ్రా చేసిన రూ.1.20 లక్షలు, సేల్స్​మెన్​ దేవరాజ్​ డ్రా చేసిన రూ.40,605ను 11శాతం వడ్డీతో కలిపి వసూలు చేయాలి.   

 కిరాణ, జనరల్​ స్టోర్​ నడిపి రూ.2.65 లక్షల నష్టపోవడానికి కారణమైన మాజీ ప్రెసిడెంట్, సెక్రటరీ, సేల్స్​మెన్లు శ్రీధర్, హన్మంతరావు, మమత, ఫణికుమార్​ నుంచి 11 శాతం ఇంట్రెస్ట్​తో డబ్బు వసూలు చేయాలి.   

నివేదికను ట్రాన్స్​లేట్​ చేయించాకే..

సొంతంగా రైస్,​ ఇతర బిజినెస్​లతో ఎత్తొండ సొసైటీ భారీగా ఇన్​కం పొంది స్టేట్​లో గుర్తింపు పొందింది. దీనికి నాలుగేండ్ల కింద ప్రెసిడెంట్​గా ఎన్నికైన అశోక్​పటేల్​పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో ఆరు నెలల కింద పదవికి రిజైన్​ చేశారు. అప్పటి నుంచి సొసైటీ వైస్​ ప్రెసిడెంట్​ ఇన్​చార్జిగా​వ్యవహరిస్తున్నారు. 

సొసైటీ అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో డీసీవో శ్రీనివాస్​ విచారణ నిర్వహించి నివేదికను పాలక సభ్యులకు పంపారు. శుక్రవారం నిర్వహించిన మీటింగ్​కు 12 మంది పాలక సభ్యులు, రైతులు అటెండ్​ కాగా గందరగోళం జరిగింది. పలువురు కోపంతో సెక్రటరీ సంతోష్​ను కొట్టడానికి వెళ్లగా, తనకేమీ తెలియదని ఆయన చెప్పాడు. ఇంగ్లీష్​లో ఉన్న రిపోర్టును పూర్తిగా స్టడీ చేసి చర్చలు ప్రారంభించాలని నిర్ణయించారు.