![ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు కీలకం](https://static.v6velugu.com/uploads/2025/02/every-graduate-vote-is-crucial-say-minister-uttamkumar-reddy_2zfKN4XQjo.jpg)
- అభివృద్ధి గురించి యువతకు వివరించాలి: మంత్రి ఉత్తమ్
- ఏమైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి
- కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలతో వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, వెలుగు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు.. ఎమ్మెల్సీ ఎలక్షన్లు రిహార్సల్స్ వంటివి అని కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే.. అదే ఊపు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనిపిస్తుందని తెలిపారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు ఎంతో కీలకమన్నారు. అందుకే, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నిక.. కాంగ్రెస్కు ఎంతో ప్రతిష్టాత్మకమైనదని చెప్పారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలతో ఉత్తమ్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు కీలకమని, క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలు భాగస్వాములు కావాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఉపాధ్యాయ నియామకాలతో పాటు పలు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన విషయాన్ని యువతకు వివరించాలని కోరారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వపరంగా సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు, పార్టీ నేతలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ సంజయ్, రాజ్ ఠాకూర్, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్చార్జ్లు పాల్గొన్నారు.