ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో అంతా అటెన్షన్.. హైడ్రా యాక్షన్ పై సర్వత్రా చర్చ

  •  అనురాగ్ పై కొరడా ఝుళిపిస్తారా..?
  •  ‘జన్వాడ’ ఫాంహౌస్ కూల్చేస్తారా
  •  ఏ అక్రమ కట్టడాన్నీ వదలమన్న డిప్యూటీ  సీఎం భట్టి
  •  కోర్టు ఉత్తర్వులను తప్పు పట్టిన ఎంపీ రఘునందన్

హైదరాబాద్: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో అంతా అటెన్షన్ అయ్యారు. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏమిటనే చర్చ మొదలైంది. ఇదే తరుణంలో అనురాగ్ యూనివర్సిటీ పై పోలీసు కేసు నమోదు కావడంతో అందరి దృష్టీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వైపు మళ్లింది. మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురంలో చెరువు బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఇరిగేషన్ అధికారి పరమేశ్ ఫిర్యాదు మేరకు ఆ సంస్థ చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. దీంతో తర్వాత అనురాగ్ యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలను కూల్చివేయబోతున్నారనే చర్చ మొదలైంది. 

ఇదే తరుణంలో జన్వాడ ఫాంహౌస్ వివాదం కూడా తెరపైకి వచ్చింది. చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించిన ఈ ఫాంహౌస్ ను కూల్చివేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనిని కూల్చివేయొద్దని పేర్కొంటూ బీఆర్ఎస్ నాయకుడు ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషన్ ను కొట్టేసింది. దీంతో జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతకు మార్గం సుగమం అయ్యింది. ఈ రెండింటిలో దేనిపై హైడ్రా యాక్షన్ ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఎవరినీ వదలబోమని హైదరాబాద్ లోని నీటివనరులను పరిరక్షించడమే హైడ్రా ధ్యేయమని చెప్పారు. కూల్చివేతలను ఆపే ప్రసక్తే లేదంటూ క్లారిటీ ఇచ్చారు.