30 కిలోమీటర్లు.. 2 గంటలు

 30 కిలోమీటర్లు..  2 గంటలు
  • సంగారెడ్డి నుంచి లింగంపల్లికి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
  • రూ.800 కోట్లతో జరుగుతున్న ముంబై 65వ నేషనల్ హైవే పనులు
  • పనులు స్పీడ్​గానే జరుగుతున్నా..  ప్రయాణికులకు తప్పని తిప్పలు

సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో ముంబై 65వ నేషనల్ హైవే విస్తరణ పనులు స్పీడ్ గానే జరుగుతున్నప్పటికీ ప్రయాణికులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. రహదారి వెడల్పు పనుల నేపథ్యంలో సంగారెడ్డి నుంచి లింగంపల్లి చేరుకోవాలంటే దాదాపు రెండు గంటల టైం పడుతోంది. 

ట్రాఫిక్ జామ్ వల్ల రోడ్డుపై కిలోమీటర్ల పొడవునా భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి.  వాటిని నివారించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. నిర్మాణాలు జరుగుతున్న చోట్ల హెచ్చరిక  బోర్డులు, రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో ఇరువైపులా తవ్విన గుంతల్లో వాహనదారులు పడిపోతున్నారు. మధ్యలో వచ్చే గ్రామాలు, యూటర్న్ లు, చౌరస్తాల వద్ద రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండేళ్ల పాటు పనులు కొనసాగే అవకాశం ఉండడంతో సంబంధిత అధికారులు రహదారిపై సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు అంటించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

చౌరస్తాల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్​ పాస్​ బ్రిడ్జిలు

 సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి లింగంపల్లి వరకు రూ.800 కోట్ల ఖర్చుతో 30 కిలోమీటర్ల మేర 6 లైన్ల పనులు జరుగుతున్నాయి. ప్రజా ప్రయోజనాలు, వాహనదారుల సౌకర్యార్థం ఈ హైవేను 4 లైన్ల నుంచి 6 లైన్లుగా విస్తరించారు. 65వ నేషనల్​హైవే ముంబై టూ హైదరాబాద్, 161వ నేషనల్ హైవే నాందేడ్ అకోలా టూ సంగారెడ్డి వరకు ఉన్న రెండు హైవేలు ఈ ఆరు లైన్ల రహదారిలో కలుస్తున్నాయి.

 ఇందుకోసం మామిడిపల్లి చౌరస్తా వద్ద లింక్ రోడ్డును ఇదివరకే నిర్మించారు. ఇక మధ్యలో గ్రామాలు, చౌరస్తాల వద్ద ప్లై ఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఈ రహదారి విస్తరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. నేషనల్ హైవేకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించి రోడ్డు నిర్మాణ తవ్వకాలు చేపడుతున్నారు.

ALSO READ : పత్తి అమ్మకాలకు ఆధార్ ​తిప్పలు

9 ఫ్లైఓవర్లు..

సంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగుతున్న 6 లైన్ల 65వ నేషనల్ హైవేలో మొత్తం 9 ఫ్లై ఓవర్, అండర్ పాస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. సంగారెడ్డి చౌరస్తా, కంది, ఐఐటీహెచ్ పాయింట్, గణేశ్ గడ్డ, రుద్రారం, లక్డారం, ఇస్నాపూర్, నవోపాన్ కమాన్, లింగంపల్లి స్టేజీల వద్ద బ్రిడ్జిలు నిర్మిస్తారు. లింగంపల్లి వద్ద  ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుండడంతో అక్కడ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టనున్నారు. 

సంగారెడ్డి నుంచి లింగంపల్లి వరకు హై స్పీడ్ హైవే నిర్మిస్తుండడంతో రోడ్డు పక్కన ఉన్న భవనాలు, తాత్కాలిక షెడ్లు ఇతరత్రా దుకాణ సముదాయాలను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రోడ్డుకు ఇరువైపులా వరద నీరు, మురుగు నీరు వెళ్లేందుకు కాల్వల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ కొత్త రహదారిపై 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా విస్తరణ పనులు సాగుతున్నాయి.