మద్దతు ధర, బోనస్‌‌‌‌ కోసం తెలంగాణకు ఏపీ సన్నొడ్లు..

మద్దతు ధర, బోనస్‌‌‌‌ కోసం తెలంగాణకు ఏపీ సన్నొడ్లు..
  • మద్దతు ధర, బోనస్‌‌‌‌ను క్యాష్‌‌‌‌ చేసుకుంటున్న దళారులు


నల్గొండ, వెలుగు : సన్న వడ్లకు తెలంగాణ ప్రభుత్వం బోనస్‌‌‌‌ ఇస్తుండడంతో కొందరు వ్యాపారులు అక్రమాలకు తెర లేపారు. బోనస్‌‌‌‌ దక్కించుకోవాలన్న ఆలోచనతో పక్కనే ఉన్న ఏపీలో భారీ స్థాయిలో సన్నవడ్లు కొని, వాటిని తెలంగాణలోని ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఈ దందాలో భాగస్వాములైన మిల్లర్లు, దళారులకు ఆఫీసర్లు సైతం సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మద్దతు ధరతో పాటు బోనస్‌‌‌‌ వస్తుండడంతో...

తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లు క్వింటాల్‌‌‌‌కు రూ. 2,320 మద్దతు ధరతో పాటు, క్వింటాల్‌‌‌‌కు రూ.500 చొప్పున బోనస్‌‌‌‌ ఇస్తోంది. ఏపీలో వర్షాలు కురుస్తున్నందున వడ్లలో తేమ శాతం ఎక్కువగా ఉంటుండడంతో అక్కడి రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. దీంతో కొందరు దళారులు రంగంలోకి దిగారు. తెలంగాణలో సన్నొడ్లకు మద్దతు ధర, బోనస్‌‌‌‌ వస్తుండడంతో.. ఏపీలో భారీ మొత్తంలో సన్నొడ్లు కొని వాటిని తెలంగాణకు తీసుకొస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని చండూరు, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, తిరుమలగిరి, కోదాడ, హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌లోని మిల్లులు, కొనుగోలు కేంద్రాల్లో వడ్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

దళారులతో ఆఫీసర్ల కుమ్మక్కు

ఏపీ నుంచి సన్నొడ్లు తీసుకొస్తున్న దళారులకు తెలంగాణలోని సివిల్‌‌‌‌ సప్లై ఆఫీసర్లు, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు సైతం సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల కింద ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన 25 లారీలను సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఒక్కో లారీలో 25 క్వింటాళ్ల సన్న వడ్లు ఉన్నాయి.

 ఈ లారీలను ఏపీలోని ఎన్టీఆర్‌‌‌‌ జిల్లా జగ్గయ్యపేట ముక్తల నుంచి తీసుకొస్తున్నట్లు గుర్తించి డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వదిలేయడంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలోని తెనాలి, మచిలీపట్నం, పామర్రు ప్రాంతాల నుంచి కూడా తెలంగాణకు సన్నొడ్లు వస్తున్నట్లు సమాచారం.

రూట్‌‌‌‌ మార్చి తెలంగాణలోకి...

ఏపీలోని జగ్గయ్యపేట నుంచి నేషనల్‌‌‌‌ హైవే మీదుగా కోదాడకు సన్నొడ్లు లారీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా భారీ స్థాయిలో వడ్లు వస్తున్నాయని తెలియడంతో దొరబండగూడెం చెక్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ వద్ద ఆఫీసర్లు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారులు లారీలను మరో దారిలో సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే జగ్గయ్యపేట మండలం నుంచి ముదిగొండ మండలమైన వల్లభి, అప్పలనరసింహపురం మీదుగా కోదాడ వైపు లారీలను మళ్లిస్తున్నారు. 

ఇలా ఒక్క రోజే 50 లారీలకు పైగా వచ్చినట్లుగా సమాచారం. దీంతో వల్లభి సమీపంలోని అప్పలనర్సింహపురం వద్ద లారీలను పట్టుకొని ఫైన్లు విధిస్తున్నారు. ఫైన్‌‌‌‌ కట్టిన తర్వాత లారీలు మళ్లీ ఉమ్మడి నల్గొండ జిల్లా వైపే వస్తున్నాయి. వాటిని ఆపి ఏపీకి తరలించాల్సిన ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నేలకొండపల్లిలో 40 లారీల పట్టివేత

నేలకొండపల్లి, వెలుగు : ఏపీ నుంచి వడ్ల లోడ్‌‌‌‌తో వస్తున్న లారీలను రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఏపీలో వడ్లు లోడ్‌‌‌‌ చేసుకున్న 40 లారీలు ఆదివారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెరువుమాదారం గ్రామం వైపు వచ్చాయి. ఒకే సారి 40 లోడ్‌‌‌‌ లారీలు రావడంతో అనుమానం వచ్చిన రైతులు, గ్రామస్తులు లారీలను అడ్డుకొని పోలీసులకు, అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వచ్చి సంబంధిత పత్రాలను తనిఖీ చేసి ఏపీలోని గుంటూరు, తెనాలి, విజయవాడ జిల్లాల నుంచి వడ్లను తెలంగాణలోని మిర్యాలగూడ, హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ ఏరియాలోని మిల్లులకు తరలిస్తున్నట్లు గుర్తించారు. 

అయితే లారీలను విజయవాడ – హైదరాబాద్‌‌‌‌ హైవేపై నుంచి తీసుకెళ్లకుండా నేలకొండపల్లి రూట్‌‌‌‌లో ఎందుకువస్తున్నారని ప్రశ్నించారు. హైవేపై వస్తే ఏపీ, తెలంగాణ బార్డర్‌‌‌‌ చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌ వద్ద ఒక్కో లారీకి రూ. ఐదు నుంచి రూ. 7 వేల వరకు సెస్‌‌‌‌ చెల్లించాల్సి ఉంటుందని, దానిని తప్పించుకునేందుకు గుండ్రాయి, వల్లభి, నేలకొండపల్లి, కోదాడ మీదుగా లారీలను తరలిస్తున్నారని పలువురు అంటున్నారు. లారీలను పట్టుకున్న ఆఫీసర్లు ఒక్కో లారీ నుంచి బార్డర్‌‌‌‌ సెస్‌‌‌‌ కింద ఫైన్‌‌‌‌ విధించగా, పోలీసులు ఓవర్‌‌‌‌ లోడ్‌‌‌‌ పెనాల్టీ విధించారు.