మీటింగ్​లకు పిలిచి అవమానిస్తున్నరు.. ఆఫీసర్ల తీరుపై జడ్పీటీసీ ఆగ్రహం

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: మీటింగ్​లకు పిలిచి ప్రజాప్రతినిధులను అవమానించడం దారుణమని లక్ష్మీదేవిపల్లి జడ్పీటీసీ మేడే వసంత ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెంలోని జడ్పీ మీటింగ్ హాల్లో చైర్మన్ కోరం కనకయ్య అధ్యక్షతన ఏడుస్థాయి సంఘాల సమావేశాలను శనివారం నిర్వహించారు. తాను జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో, స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో మాట్లాడిన ముఖ్యమైన అంశాలను కూడా మినిట్స్ బుక్కులో రాయడం లేదన్నారు. మీటింగ్​లకు రాని జడ్పీటీసీల పేర్లతో రాస్తున్నారని మండిపడ్డారు. తాను మాట్లాడిన విషయాలను ఇతరులు మాట్లాడినట్టుగా ఎలా రాస్తున్నారని ఆఫీసర్లను నిలదీశారు. ఏ ఒక్క చిన్న సమస్యను కూడా పరిష్కరించని అధికారులు జనరల్ బాడీ మీటింగ్ లు, స్టాండింగ్ కమిటీ మీటింగ్​లు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. ఆఫీసర్ల తీరును నిరసిస్తూ వెళ్తుండగా జడ్పీ చైర్మన్ సర్ది చెప్పడానికి యత్నించారు. అధికారులు, సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుగా నమోదు చేసే వారిపై చర్య తీసుకోవాలని జడ్పీ సీఈవోకు సూచించారు.