
- 2018లో కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన గండ్ర
- 2023 ఎన్నికల్లో ఓటమి
- బీఆర్‌ఎస్ శాసనమండలి సభాపక్ష నేతగా వ్యవహరిస్తున్న చారీ
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడి బీఆర్‌ఎస్ లో మళ్లీ ముసలం మొదలైంది. ప్రస్తుతం ఆ పార్టీ శాసనమండలి సభాపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. చారీ కేసీఆర్ కుడిభుజం అయితే, మాజీ ఎమ్మెల్యే గండ్ర కేటీఆర్ పక్షాన ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుండగా వర్గపోరుతో గులాబీ కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏ లీడర్ దగ్గరికి వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు.
బడా లీడర్ల మధ్య పోటీ..
బీఆర్‌ఎస్ ను ఏర్పాటు చేసిన సమయంలో కేసీఆర్‌తోపాటు ఉన్న లీడర్లలో సిరికొండ మధుసూదనాచారి ఒకరు. ఈయనంటే కేసీఆర్‌కు వల్లమానిన అభిమానం. ఆ అభిమానంతోటే భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం తరఫున 2009, 2014, 2019 మూడు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రత్యేక రాష్ర్టంలో 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ తొలి శాసనసభాపతిగా మధుసూదనాచారి పనిచేశారు. ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో చారి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు.
అప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గండ్ర బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకొని తన భార్య గండ్ర జ్యోతిని అప్పటి వరంగల్ రూరల్ జడ్పీ చైర్ పర్సన్ చేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో సిరికొండ మధుసూదనాచారికి 2023 అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వలేదు. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన తాజీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు చేతిలో ఓటమి చవిచూశారు. కేసీఆర్ మాటిచ్చినట్లుగానే సిరికొండ మధుసూదనాచారిని ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత పార్టీ తరఫున శాసనమండలి సభాపక్ష నేతను చేశారు.
కొన్నాళ్లపాటు సైలెంట్‌గా ఉన్న చారి ఇప్పుడు మళ్లీ భూపాలపల్లి నియోజకవర్గంలో తిరగడం స్టార్ట్ చేశారు. ఇది గండ్ర వెంకటరమణారెడ్డికి మింగుడు పడటం లేదు. ఒకే నియోజకర్గంలో ఇద్దరు లీడర్లు తిరగడం ఏంటీ? అని కేటీఆర్‌కు కంప్లైంట్ చేశారు. అయినా కూడా చారి వెనక్కి తగ్గట్లేదు. ఆయన రెండో కొడుకు ప్రశాంత్ సైతం పార్టీ తరఫున తిరుగుతూ గండ్రకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు.
గ్రామాల్లో మళ్లీ మొదలైన వర్గపోరు..
భూపాలపల్లి నియోజకవర్గంలోని ఏ గ్రామంలో చూసినా బీఆర్‌ఎస్ పార్టీలో వర్గపోరు కన్పిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన కార్యకర్తల్లో ఎక్కువ మంది సిరికొండ మధుసూదనాచారి వెంటే నడుస్తున్నారు. వీరంతా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలవట్లేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి, లాఠీ దెబ్బలు తిని, కేసుల పాలైన తమకు మాజీ ఎమ్మెల్యే గండ్ర పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వనేలేదని బాహటంగా చెబుతున్నారు.
చారి ఆధ్వర్యంలోనే తామంతా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతామని ప్రకటిస్తున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే గండ్ర పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మాదిరింది. భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చారి సాబ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్వయంగా కేసీఆర్ ఇటీవల జరిగిన పార్టీ మీటింగ్‌లో చెప్పారని మొగుళ్లపల్లి పార్టీ కార్యకర్తల సమావేశంలో గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. అవసరం అయితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకోవచ్చన్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆ తర్వాత సిరికొండ మధుసూదనాచారి కొడుకు ప్రశాంత్ శాయంపేట మండలంలో పర్యటిస్తూ చారిని తిరగొద్దని కేసీఆర్ చెప్పనేలేదని, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లలో గెలుపు గుర్రాలకే బీఆర్‌ఎస్ టికెట్ వస్తుందని, అది కూడా సిరికొండకే అని అన్నారు. దీంతో స్థానిక సంస్థల ఎలక్షన్ల సమయం దగ్గర పడుతుండడంతో కార్యకర్తల్లో తీవ్ర అయోమయం నెలకొంది.