- హాస్పిటల్‌లో ఎలాంటి పొరపాటు జరగలేదన్న సూపరింటెండెంట్
హనుమకొండ, వెలుగు : పెండ్లయిన ఏడేండ్లకు కొడుకు పుడితే.. తమకు చనిపోయిన ఆడ శిశువును అప్పగించారంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్‌లో గురువారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కలుకోళ్ల సాంబరాజు, -అనూష దంపతులకు ఏడేండ్ల కిందట వివాహమైంది. అనూష గతేడాది గర్భం దాల్చింది. డెలివరీ కోసం బుధవారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్‌లో చేరింది.
ముందుగా నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించిన ఆ తర్వాత ఆపరేషన్ చేస్తామంటూ గురువారం ఉదయం అనూషను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. అనంతరం అనూషకు మృత శిశువుకు జన్మనిచ్చిందని కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే అనూషకు కొడుకు పుట్టాడని, హాస్పిటల్ సిబ్బందే బాబుని మార్చి చనిపోయిన ఆడశిశువును అప్పగిస్తున్నారంటూ కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో హాస్పిటల్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్ వద్దకు వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ విషయమై జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ తమ వద్ద ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు. పాప చనిపోయిన విషయాన్ని అనూషకు ముందుగానే చెప్పామన్నారు. డీఎన్‌ఏ టెస్ట్ చేసినా అసలు విషయం తెలుస్తుందని, ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని చెప్పారు.