బ్యాంకులో గోల్డ్ తాకట్టు పెడితే అమ్మేశారు

బ్యాంకులో గోల్డ్ తాకట్టు పెడితే అమ్మేశారు
  • గద్వాల  ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ బ్యాంకు వద్ద బాధిత కుటుంబం ఆందోళన

గద్వాల, వెలుగు: గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసు కోగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అమ్మేశారని బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది.  వివరాల్లోకి వెళితే..  జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం పాతపాలెం గ్రామానికి చెందిన అశోక్ గద్వాలలోని ఐఐఎఫ్ఎల్ గోల్డ్ బ్యాంకులో 5 తులాల బంగారాన్ని 2023 అక్టోబర్ లో తాకట్టు పెట్టి రూ. 2 లక్షలు లోన్ తీసుకున్నాడు. 2024 డిసెంబర్ లో వడ్డీ కింద రూ. 45 వేలు ఆన్ లైన్ లో కట్టాడు. గోల్డ్ ను విడిపించుకునేందుకు ఈనెల 26న బ్యాంకుకు ఫోన్ చేయగా ఈనెల 11నే ఆక్షన్ లో అమ్మేశామని చెప్పారు. 

దీంతో బాధితుడు అశోక్ శుక్రవారం బ్యాంకు వద్దకు కుటుంబంతో వచ్చి ఆందోళనకు దిగారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, చెప్పకుండా తమ గోల్డ్ ను ఎలా ఆక్షన్ వేస్తారని ప్రశ్నిస్తూ   అమ్మినవారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. బ్యాంకు రూల్స్ ప్రకారం ఏడాది దాటితే గోల్డ్ ను ఆక్షన్ వేస్తామని అందులో భాగంగానే అశోక్ గోల్డ్ ను అమ్మినట్టు సిబ్బంది తెలిపారు. గోల్డ్ కావాలని అడగడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఐఐఎఫ్ఎల్ గద్వాల బ్రాంచ్ మేనేజర్ పరంధాముడు చెప్పారు.