జోరువాన కురుస్తున్నా నిమజ్జనం ఆగలె..

భద్రాచలం,వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి తీరానికి శుక్రవారం వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి నిమజ్జనం కోసం విగ్రహాలను లారీలు, ట్రాక్టర్లలో తీసుకొచ్చారు. విజయవాడ–-జగదల్​పూర్​ హైవేలో అంబేద్కర్​ సెంటర్​ మీదుగా డిగ్రీ కాలేజీ  వరకు చేరుకుని అక్కడ నుంచి సుభాష్​నగర్​ కరకట్ట మీదుగా స్నానఘట్టాల వద్దకు వాహనాలు చేరుకున్నాయి. క్రేన్ల సాయంతో విగ్రహాలను లాంచీల పైకి ఎక్కించి గోదావరిలో నిమజ్జనం చేశారు. అనంతరం భక్తులు రామయ్య దర్శనం కోసం బారులుతీరారు. అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ రోహిత్​రాజు, తహసీల్దార్​ శ్రీనివాస్​యాదవ్​, సీఐ నాగరాజురెడ్డి, ఈవో వెంకటేశ్వర్లు, దేవస్థానం డీఈ రవీందర్​ తదితరులు నిమజ్జనం సందర్భంగా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. శని,ఆదివారాల్లో ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు వచ్చే అవకాశం ఉండడంతో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

వర్షంలోనే నిమజ్జనం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:వినాయక నిమజ్జనం సందర్భంగా కొత్తగూడెంలోని గణేశ్​​టెంపుల్​లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంపుల్​లో కొలువైన విజయ విఘ్నేశ్వరుడు బాలగణపతిగా ఆకట్టుకున్నాడు. ఇక్కడి గణపతి లడ్డూను వేలంపాటలో మనోహర్​రావు రూ.52,516 దక్కించుకున్నారు. పట్టణంలోని వినాయక విగ్రహాలను వర్షంలోనే నిమజ్జనానికి తరలించారు. ఆటపాటలతో నిమజ్జన శోభాయాత్ర ఆకట్టుకుంది.

కోటిన్నర కరెన్సీతో అలంకరణ

పాల్వంచ,వెలుగు: పాల్వంచలోని రాంనగర్ తూర్పు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో రూ.1.50 కోట్ల కరెన్సీ నోట్లతో వినాయకుడిని అలంకరించారు. సాయంత్రం నుంచి జోరువాన కురుస్తున్నా భక్తులు వినాయక మండపానికి తరలివచ్చి పూజలు చేశారు.