
లింగంపేట, వెలుగు : అప్పుల బాధ తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి సొప్పరి మాణిక్యం (40) తనకున్న రెండు ఎకరాల్లో వరి, మక్కజొన్న సాగు చేస్తున్నాడు. కొంతకాలం కింద రెండు బోర్లు వేయించగా నీళ్లు పడలేదు. గతంలో దుబాయ్‌కు వెళ్లడం కోసం కొంత అప్పు చేశాడు. దుబాయ్‌కి వెళ్లడం, బోరు వేయడం కోసం మొత్తం రూ. 4 లక్షల వరకు అప్పు చేశాడు. వ్యవసాయం కలిసి రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురయ్యాడు.
బుధవారం ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లిన మాణిక్యం అక్కడే పురుగుల మందు తాగాడు. గమనించిన అతడి కొడుకులు సంగమేశ్వర్, సందీప్ వెంటనే కామారెడ్డిలోని గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బుధవారం రాత్రి చనిపోయాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.