- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: పంటలను అడవి జంతువుల నుంచి రక్షించుకునేందుకు పొలం చుట్టూ వేసిన విద్యుత్ తీగ కాలికి తగిలి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగింది. కప్పపహాడ్ గ్రామానికి చెందిన రైతు నిట్టు యాదయ్య(59) బుధవారం సాయంత్రం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు.
ఈ క్రమంలో మరో రైతు పంటలను రక్షించుకునేందుకు పొలం చుట్టూ వేసిన కరెంట్ తీగ యాదయ్య కాలికి తగిలింది. దీంతో యాదయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి బంధువులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదయ్య మృతదేహాన్ని పోస్టు మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.